ys sunitha Fire on Ysrcp : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు రక్తంతో తడిసిపోయాయి.. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావాలి.. లేకపోతే ఆ పాపం చుట్టుకుంటుంది అని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి మాట్లాడారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దాం.. మా అన్న పార్టీకి ఓటు వేయవద్దు.. జగనన్న పార్టీని ఎన్నికల్లో గెలవనీయకూడదని పిలుపునిచ్చారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని సునీత అన్నారు. వివేకానందరెడ్డికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని చెప్పారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయవద్దని, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలని పిలుపునిచ్చారు. హంతకులు, హంతకుల పార్టీకి ఓటు వేయవద్దు.. జగనన్న పార్టీని మాత్రం ఎన్నికల్లో గెలవనీయకూడదు అని కోరారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా అనేది అప్రస్తుతం అని సున్నితంగా తిరస్కరించారు.
అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల
మాపై నిందలు వేసినా.. సీతలా నిర్దోషిత్వం నిరూపించుకుంటామని సునీత స్పష్టం చేశారు. మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాను మీరు మర్చిపోయారా? అన్నం పెట్టిన చేతిని నరకడం, వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం కాదా అని ప్రశ్నించారు. రాజకీయం అంటే ప్రజల కోసం అని పనిచేసిన వివేకాను చూశాం అని అన్నారు. ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను చూస్తున్నామని చెప్పారు. తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్నవాళ్లు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు.
ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారు? దిగ్భ్రాంతిలో ఉండిపోతారా? అని అడిగారు. ప్రజలారా ఇప్పుడు మీకు స్పందించే అవకాశం వచ్చింది.. స్పందించండి అని కోరారు. వైఎస్సార్సీపీ పునాదులు రక్తంతో తడిసి ఉన్నాయని, వివేకానందరెడ్డి, కోడికత్తి శ్రీను రక్తంలో మునిగాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా భవిష్యత్ కోసం పార్టీ నుంచి బయటకురండి.. మీరు బయటకు రాకపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది.. జగనన్న మిమ్మల్ని కూడా తన ఊబిలోకి తీసుకెళ్తాడని చెప్పారు. వివేకా ఐదో వర్థంతి సందర్భంగా సంకల్పం చేద్దాం.. ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం.. ఈ పోరాటంలో మీరందరూ భాగంకండి.. ఓటు ద్వారా వివేకాను చంపినవాళ్లకు బుద్ధి చెబుదాం, అన్యాయంపై న్యాయం గెలుస్తుందని నిరూపిద్దాం అని సునీత పిలుపునిచ్చారు. నేరస్థులకు శిక్షపడాలని పోరాడుతున్న తనపై నింద మోపుతారా? అని సునీత ప్రశ్నించారు. తనకు, తన కుటుంబానికి ఈ హత్యతో సంబంధం ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదు? మేం ఈ నేరం చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా..? అని నిలదీశారు.
శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేక పోయా: వివేకా సతీమణి
వివేకాకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగనన్న సీఎం అయ్యారని, ప్రజలందరికీ న్యాయం చేస్తానని జగనన్న ప్రమాణస్వీకారం చేశారని సునీత గుర్తుచేశారు. జగనన్న ప్రమాణ స్వీకారం చూసి అంతా గర్వపడ్డామని తెలిపారు. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.. అంతఃకరణశుద్ధిగా అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు.
వివేకాను చంపిన, చంపించినవారికి శిక్షపడేలా చేయాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తు చేస్తూ.. ఇప్పటివరకూ హంతకులకు శిక్షపడేలా ఎందుకు చేయలేదు? మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించారు. 2009లో జగనన్న రాజకీయాల్లోకి రావాలనుకున్నారని, అదే సమయంలో వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకున్నారని సునీత వెల్లడించారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని వివేకా నిత్యం ఆలోచించేవారని, తాను అమెరికాలో చదివేటప్పుడు అక్కడికొచ్చి 2, 3 వారాలకు మించి ఉండేవారు కాదని తెలిపారు. వివేకా మొదట్లో కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారని, ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్, తదనంతరం కాంగ్రెస్‌లోకి వెళ్లారని చెప్పారు. తాను ఐదో తరగతిలో ఉన్నప్పుడు కార్ల్‌మార్క్స్ పుస్తకాలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి కుటుంబానికి వివేకా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారన్న సునీత అన్నమాట జవదాటని తమ్ముడు, చెల్లెళ్లంటే ప్రాణం అని వెల్లడించారు. కడప, పులివెందుల అంటే వివేకాకు ఎంతో ఇష్టం, వ్యవసాయం అంటే ప్రాణం.. విదేశాలకు వెళ్లి సాగు గురించి తెలుసుకునేవారని పేర్కొన్నారు.
జగన్ పార్టీకి ఓటేయొద్దు- మా నాన్నని వాళ్లే చంపారు : వైఎస్ సునీత