YS Sharmila Election Campaign in Pulivendula : ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకానందరెడ్డి కుమార్తె సునీత కడప జిల్లాలో పర్యటించారు. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల, సునీత పాల్గొన్నారు. సభ ప్రారంభ సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో షర్మిల వైఎస్సార్సీపీపై, సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వివేకా విషయంలో జగన్ న్యాయం చేయలేకపోయారని షర్మిల ధ్వజమెత్తారు.
పులివెందుల ప్రజాలారా మాకు న్యాయం చేయండి : షర్మిల మాట్లాడుతూ ఒక వైపు వైఎస్సార్ బిడ్డ మరో వైపు హంతకుడు ఉన్నాడని, తమ వైపు న్యాయం, ధర్మం ఉందని అన్నారు. వైఎస్‌ఆర్ బిడ్డ కావాలో? వివేకా హత్యకేసు నిందితుడు అవినాష్‌రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. "మీ ఆడ బిడ్డలం కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజాలారా మాకు న్యాయం చేయండి" ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కడప నుంచి అతడిని మార్చాలని వైఎస్సార్సీపీ చూస్తోందన్నారు. అలా మారిస్తే వివేకాను చంపింది అవినాషే అని జగన్ నమ్మినట్టే కదా! అని వ్యాఖ్యానించారు.
పులివెందులకు రండి - వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం : షర్మిల - YS Sharmila election campaign
ప్రధాని మోదీ ముందు జగన్ పిల్లిలా మారారు : వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే, జగన్ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. సాక్షాత్తూ వైఎస్ తమ్ముడు హత్యకు గురైనా న్యాయం జరగట్లేదని, హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ నిర్ధరించిందని గుర్తు చేశారు. గూగుల్ టేక్‌అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలు సేకరించిందని, ఇన్ని సాక్ష్యాలున్నా సీబీఐ, అవినాష్‌రెడ్డిని టచ్ చేయలేకపోయిందని అన్నారు. ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చింది నిందితులను కాపాడేందుకేనా? అని ప్రశ్నించారు.
జగన్ సీఎం అయ్యాక అందరికంటే ఎక్కువ నష్టపోయింది సునీతేనని తెలిపారు. పులి వెందుల పులి అన్నారు. ప్రధాని మోదీ ముందు జగన్ పిల్లిలా మారారని, ప్రత్యేక హోదా కోసం ఆనాడు రాజీనామా డ్రామాలు, దీక్షలు చేశారని ఎద్దేవా చేశారు. సీఎం అయిన తర్వాత బీజేపీతో దోస్తీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞం వైఎస్‌ఆర్ కల అని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు చేశారా? అని ప్రశ్నించారు. పులివెందుల బిడ్డ సీఎంగా ఉండి రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా కట్ట లేదంటే అవమానం కాదా? అంటూ ప్రశ్నించారు.
కోటలో కుంభకర్ణుడిలా నిద్రపోయారు : వివేకా అంటే స్వయానా తనకు చిన్నాన్న రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్సార్‌కు వివేకా అలా అని అన్నారు. సొంత రక్త నంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుకు? జనాలు జగన్‌ను నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా? పులివెందుల పులి కాదని పిల్లి అని, 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగున్నరేళ్లుగా కోటలో నిద్రపోయాడని, ఇప్పుడు కుంభకర్ణుడి లెక్క నిద్రలేచి డీఎస్సీ అంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు. 5 ఏళ్లు హంతకులను కాపాడారని, మళ్లీ వారికే సీటు ఇచ్చారని అన్నారు. తాను వైఎస్సార్ బిడ్డను అని, పులి కడుపున పులే పుడుతుందని అన్నారు. వైఎస్సార్ బిడ్డ ఎవరికీ భయపదని తెలిపారు. హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి పోటీ చేస్తోన్నాని వివరించారు.
షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలి : వివేకా హత్య ఘటనలో ఐదేళ్లుగా షర్మిల తనకు అండగా ఉందని సునీత తెలిపారు. దిల్లీలో మన గళం వినిపించాలంటే షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
వైఎస్ వివేకా హత్య ప్రధానాంశంగా పులివెందులలో షర్మిల ఎన్నికల ప్రచారం - Sharmila Election Campaign