YS Sharmila and Sunitha Meeting: ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సునీత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా వీరి భేటీ చర్చనీయాంశమవుతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. దాదాపు 2 గంటలుగా ఇద్దరి మధ్య చర్చలు సాగాయి.
ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగినట్లు తెలుస్తోంది. తన తండ్రి వివేకా (YS Vivekananda Reddy) హత్యపై సునీత తొలి నుంచి గట్టిగా పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు సైతం అయ్యారు.
న్యాయపోరాటం చేస్తూనే రాజకీయంగా పోరాడతారా?: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు మరికొంతమంది చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా, అవినాష్‌రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులపై రాజకీయంగా పోరాడాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల భేటీ: అదే విధంగా ఇడుపులపాయ ఎస్టేట్‌కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) సైతం వచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డితోనూ షర్మిల సమావేశమయ్యారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ సమాధికి సునీత, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలసి షర్మిల నివాళులర్పించారు.
జగన్‌పైకి మరో బాణం సిద్ధమా!: సీఎం జగన్‌పైకి మరో బాణం దూసుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. షర్మిల, సునీత భేటీ కావడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సునీత ఆమెను తొలిసారి కలిశారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం.
కాసేపట్లో కీలక నిర్ణయం వెలువడనుందా?" వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణను కోరడంతోనే సీఎం జగన్, వైఎస్ సునీత మధ్య కుటుంబపరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై సునీత షర్మిలతో చర్చించినట్లు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచారు. సీబీఐకి తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు జరిగిన భేటీతో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.