YS Sharmila Allegations on CM Jagan: రాష్ట్రంలో యువతను నిరుద్యోగులుగా మార్చి, పోలవరం నిర్మాణం ఆపేసి, అభివృద్ధిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైసీపీ పాలనలో గుంటూరు గుంతలూరుగా మారిందని ఎద్దేవా చేశారు. గుంటూరులో మంచి రహదారులు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
'భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదు - నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు'
జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు: ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ఇంక అభివృద్ధికి నిధులు ఎక్కడ వస్తాయని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారని, జగన్ మాత్రం పెద్ద పెద్ద గోడలు కట్టుకోని కోట లోపలే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు ఇంకా ప్రజలను ఎలా కలుస్తారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు విషయంలో వైఎస్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి సాధించారని, జగన్ పాలనలో మాత్రం రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేదని విమర్శించారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా జగన్ స్పందించలేదని, జగన్ బీజేపీకి బానిసలా మారిపోయారని దుయ్యబట్టారు.
జగనన్న వల్లే వైఎస్ కుటుంబం చీలింది: షర్మిల
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: ముస్లింలు, క్రిస్టియన్స్కు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని విమర్శించారు. పోలవరం, ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా వైసీపీ మాత్రం బీజేపీకి ఊడిగం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి గడపా తొక్కుతా, వీలైనంత ఎక్కువ మందిని కలుస్తానని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ, జనసేన, టీడీపీలలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మస్తాన్ వలి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో లేని పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడం హాస్యాస్పదం : మంత్రి అమర్‌నాథ్
జగన్ మొట్ట మొదట చెప్పిన మాట ఏంటంటే జనవరి 1వ తేదీ కల్లా జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఇస్తానన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ ఐదేళ్లలో ఒక్క సంవత్సరం అయినా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ? 30 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఏమైనా ఉందా, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి నోటిఫికేషన్లు ఇస్తారు మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు గుంతలూరుగా మారింది.- వైఎస్ షర్మిల, పీసీసీ అధ్యక్షురాలు