Jagan Tirupati Tour Cancelled : వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరాల్సి ఉన్న జగన్, తిరుపతి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేయించుకున్నారు. అనంతరం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటున్నారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణం అని, అనుమతి లేదంటూ పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడం లాంటి పరిస్థితి గతంలో తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలపై కూటమి నేతలు చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులు కనిపిస్తున్నాయన్న జగన్, లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ వివాదం తెచ్చారని విమర్శించారు. తిరుమల పవిత్రత, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారని మండిపడ్డారు.
టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతోంది: జంతువుల కొవ్వుతో ప్రసాదాలు తయారు చేశారని అబద్ధాలు చెబుతున్నారన్న అన్నారు. కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదేనని, తక్కువ రేటుకు కోట్ చేసిన వారికి టీటీడీ టెండర్ ఖరారు చేస్తుందన్నారు. టీటీడీ బోర్డులోని సభ్యులు ప్రముఖులు అంతా పారదర్శకంగా పనిచేస్తారని తెలిపారు. టీటీడీ సభ్యులుగా తీసుకోవాలంటూ కేంద్రం, సీఎంలు కొందరిని సిఫారసు చేస్తారని మరోసారి వ్యాఖ్యానించారు.
క్వాలిటీ పరీక్షలు పూర్తయ్యాకే వాహనాలు వస్తాయని, టీటీడీ కూడా మళ్లీ క్వాలిటీ చెక్ చేస్తోందని జగన్ తెలిపారు. తప్పు చేసేందుకు అవకాశం లేని వ్యవస్థ టీటీడీలో ఉందని, గతంలో టీడీపీ హయాంలో వాహనాలు వెనక్కి పంపారని, తమ హయాంలోనూ 18 సార్లు వాహనాలను వెనక్కి పంపారని గుర్తు చేశారు. అప్పుడప్పుడూ నమూనాలను సీఎఫ్‌టీఆర్‌ఐ మైసూర్‌కు పంపిస్తారన్న జగన్, ఇప్పుడు మొదటిసారి నమూనాల పరీక్షకు గుజరాత్ పంపారని తెలిపారు.
జగన్ ఇకనైనా రాజకీయాలు మానుకో - మీ పూజలు అబద్ధం: పయ్యావుల కేశవ్ - Minister Payyavula On YS Jagan
సీఎం అబద్ధాలు ఆడుతున్నారు: శ్రీవారి ప్రసాదాల్లో వాడని నెయ్యిని వాడినట్లు ఎందుకు చెప్తున్నారని, జంతువుల కొవ్వు వాడారని స్వయంగా సీఎం అబద్ధాలు ఆడుతున్నారని జగన్ పేర్కొన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన నివేదికను టీడీపీ కార్యాలయం రిలీజ్ చేసిందన్న అన్నారు. రహస్య నివేదిక అయితే టీడీపీ ఆఫీసు నుంచి ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదని టీటీడీ ఈవో పలుసార్లు చెప్పినా వినకుండా సీఎం మళ్లీ అబద్ధాలు చెప్పారని, రాజకీయ లబ్ధి కోసమే అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. తిరుమల ప్రసాదాలపై దుష్ప్రచారం చేయడం అపవిత్రత కాదా అని ప్రశ్నించారు. ఆవులు వెజిటబుల్స్ ఆయిల్ తిన్నా ఇలాంటి ఫలితాలు వస్తాయని నివేదికలో ఉందని చెప్పారు.
రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి ప్రసాదాల విశిష్టతను దెబ్బతీస్తున్నారని, తిరుమల ప్రసాదాలపై అనుమానాలు రేకెత్తించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. తన కులం, మతం గురించి ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనం చేసుకున్నాకే నా పాదయాత్ర ప్రారంభించానని, పాదయాత్ర పూర్తయ్యాక కూడా నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు. గతంలో అనేకసార్లు తిరుమల వెళ్లాననే విషయం అందరికీ తెలుసని, బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఐదుసార్లు వస్త్రాలు సమర్పించానని అన్నారు.
నా మతం మానవత్వం: నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నానని, బయటకు వెళ్తే హిందూ సంప్రదాయాలు గౌరవిస్తానని చెప్పారు. నా మతం మానవత్వమని, కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అంటూ అడగడం సరికాదని, మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతావారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని, కళ్ల ఎదుటే ఇలాంటివి జరుగుతుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని అన్నారు. హిందూమతానికి తామే టార్చ్ బేరర్స్ అని చెప్పుకొంటున్న బీజేపీ నేతలు, తిరుమల లడ్డూలపై దుష్ప్రచారం చేస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు.
జగన్ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour