YS Jagan will Start Bus Yatra from Idupulapaya: గత ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి అందరికీ ముద్దులిస్తూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన జగన్ ఆ తర్వాత ఐదేళ్లపాటు మళ్లీ జనం ముఖం చూసిన పాపాన పోలేదు. ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లాలన్నా పరదాలు, బారీకేడ్లు మాటున మమా అనిపించే వైసీపీ అధినేత మళ్లీ ఎన్నికలు రావడంతో జనంబాట పడుతున్నారు. నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు.
అయితే గాల్లో లేదా పరదాలు: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పర్యటన ఖరారైందంటే ముందుగా అక్కడి చేరుకునేది పోలీసులో, బందోబస్తు సిబ్బందో కాదు బారీకేడ్లు, పరదాలు. ఇంటి నుంచి కూతవేటు దూరంలోని బహిరంగ సభకు సైతం హెలికాప్టర్‌లో చేరుకునే సీఎం జగన్ అక్కడి నుంచి సభా వేదికకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సిందే. ఏడాదిన్నరగా బటన్ నొక్కుడు కార్యక్రమం పేరిట ప్రజాధనంతో నిర్వహించిన బహిరంగ సభలకు సైతం ఆయన గాల్లోనే వచ్చి వెళ్లారు తప్ప ఐదేళ్ల కాలంలో జనం మధ్యకు జగన్ వచ్చిన దాఖలాలు లేవు. హెలీప్యాడ్ నుంచి ఆయన వచ్చే మార్గంలో ఎవరికీ కనిపించకుండా పరదాలు కట్టేస్తారు.
మొక్కలు పీకిపారేయాల్సిందే: భద్రత పేరిట జనజీవనాన్ని స్తంభింపజేస్తారు. ఆ మార్గంలో చెట్లు, డివైడర్‌కు మధ్యలో ఉండే మొక్కలు మొత్తం పీకి పారేయాల్సిందే. జగన్ పర్యటన అంటేనే జనం హడలెత్తిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జగన్ ఇప్పుడు జనం బాట పట్టారు. గతంలో పాదయాత్ర చేసిన ఆయన ఇప్పుడు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. నేడు ఇడుపులపాయ నుంచి జగన్ బస్సుయాత్ర (YS Jagan Bus Yatra) చేపట్టనున్నారు. తొలి మూడు రోజుల్లో 300 కిలోమీటర్లకు పైగా యాత్ర నిర్వహించనున్నారు. రాత్రిళ్లు మార్గమధ్యలోనే బస చేయనున్నారు. ఐదేళ్లుగా జనాన్ని కలవని జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ యాత్రలు చేపట్టడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
జనానికి దూరంగా జగన్: ఐదేళ్లుగా తాడేపల్లిలోని ఇల్లు దాటి కనీసం సచివాలయానికి కూడా రాని జగన్ నేరుగా జనాలను కలిసింది లేదు. ఆయన ఇంటి వద్దే స్పందన కార్యక్రమంలో జనాల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారని గొప్పలు చెప్పినా ఎప్పుడూ అమలు కాలేదు. క్యాంపు కార్యాలయంలో జగన్ సర్వదర్శనం కోసం క్యూలైన్ వృద్ధులు, దివ్యాంగులు, రోగుల వంటివారి కోసం చిన్నపాటి సిటింగ్ ఏర్పాట్లూ చేపట్టారు. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క రోజూ ప్రజలను కలిసింది లేదు. సీఎంను కలవడం తర్వాతి సంగతి అసలు సామాన్యులను సీఎం క్యాంపు కార్యాలయం గేటు వరకూ ఎప్పుడూ అనుమతించనే లేదు.
ఉపాధి హామీ పథకానికి జగన్ సమాధి - వేతనాలు నిలిచి కూలీల అవస్థలు - Rural Employment Guarantee Scheme