YS Jagan Meeting with Paderu And Araku YSRCP Leaders : ఉమ్మడి విశాఖ జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (Vizag MLC BY Election)కు ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిని నిలపడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుపట్టారు. విశాఖలో తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉందని, నైతికత ఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. మెజారిటీ లేకపోయినా సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని నిలిపి, అధర్మ యుద్ధానికి తెర తీశారని ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పాడేరు, అరకు నియోజకవర్గాల స్ధానిక సంస్ధల పార్టీ ప్రజా ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
హైదరాబాద్‌కు తరలింపు : జగన్‌తో భేటీ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. వారిని అక్కడే ఉంచుతారా, మరోచోటుకు తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. గురువారం (నేడు) పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. యలమంచిలి సంబంధించి శనివారం సమావేశం నిర్వహించి, వారిని కూడా ఈ క్యాంపునకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంతమందిని తెలంగాణాలోని హైదరాబాద్‌కు తరలించవచ్చనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ - YCP Corporators To Joined Janasena
ప్రలోభాలకు ఎవ్వరూ లొంగవద్దు : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్సీపీ ప్రతినిధులకు ప్రలోభాలకు గురి చేస్తూ వారిని లొంగదీసుకోవాలన్న యత్నం చేయడం దారుణని జగన్ అన్నారు. ప్రలోభాలకు ఎవ్వరూ లొంగవద్దని సూచించారు. ఐదు సంవత్సరాలు కళ్లు మూసుకుంటే అయిపోతుందని, ఈ పోరాటంలో నేతల సహకారం మెండుగా ఉండాలని కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా ఏకాభిప్రాయంతోనే బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినట్లు జగన్ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో 600కు పైగా స్థానాల్లో తమ పార్టీ గెలిస్తే, టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే విజయం సాధించారని, ఇద్దరి మధ్య దాదాపుగా 387 స్ధానాల తేడా ఉందని అన్నారు. వైఎస్సార్సీపీ నిలిపిన బొత్సకు అండగా నిలిచి గెలిపించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన నేతలకు జగన్ సూచించారు.
సూపర్ సిక్స్, సూపర్ టెన్, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే సమాధానం చెప్పుకోలేని స్ధితిలో టీడీపీ కేడర్ ఉందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు కార్యక్రమాలు, ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలకు ఎవ్వరూ లొంగవద్దని కోరారు.
ఒక్కొక్కరికి రూ.2 లక్షలు : స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తీసుకువెళ్లే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తారని చర్చ జరిగినట్లు సమాచారం. దీనిపై కొందరు ప్రజాప్రతినిధులు ఒకలా, మరికొందరు మరోలా స్పందించగా తర్వాత ఖరారు చేద్దామని చర్చను అప్పటితో ఆపేసినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో కూటమి అభ్యర్థి? - Alliance Candidate in MLC Elections