Shocking Results For Congress In Mahbubnagar District : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారే. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు విజయం కాంగ్రెస్ పార్టీదేనని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ వచ్చిన ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో హోరాహోరీగా సాగిన పోరులో స్వల్వఓట్ల తేడాతో కాంగ్రెస్ పరాజయం పాలైంది. బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ చేతిలో చల్లా వంశీచంద్ రెడ్డి 4వేల 500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై ప్రస్తుతం కాంగ్రెస్ సహా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సాధించిన ఓట్లు, మెజారిటీలు, ఎంపీ ఎన్నికల్లో దక్కి ఉంటే వంశీ గెలుపు నల్లేరు మీద నడకయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పై బీజేపీ సాధించిన ఆధిక్యాలపై చర్చ సాగుతోంది. కొడంగల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లక్షా 7వేల ఓట్లు వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో ఆ సంఖ్య 87వేలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీ ఎన్నికల్లో కొండగల్‌లో కాంగ్రెస్ మెజారిటీ 21వేలకే పరిమితమైంది.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 82వేల ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో 73వేలకే పరిమితమయ్యాయి. యెన్నం శ్రీనివాస్ రెడ్డి 18వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌పై సుమారు 7వేల ఆధిక్యంలో నిలిచింది. జడ్చర్లలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90వేల ఓట్లు వస్తే ఎంపీకి వచ్చే సరికి 68 వేలకే పరిమితమయ్యాయి. జడ్చర్లలో 15వేల మెజారిటీతో అనిరుద్ రెడ్డి గెలుపొందగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 4వేల800ల మెజారిటీ మాత్రమే దక్కింది. కొండగల్, షాదనగర్, జడ్చర్ల మినహా నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దక్కింది. మొత్తంగా శాసనసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో 6 లక్షల 11వేల ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో 5లక్షల ఓట్లే దక్కాయి.
ఏడు నియోజక వర్గాల్లో ప్రచారసభలకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం, ఏడుగురు ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం నిర్వహించినా స్వల్వ ఓట్ల తేడాతో ఓటమి పాలవడం కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశని నింపింది. ఈ నెల 2న వెలువడిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం అందుకోవడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మన్నె జీవన్ రెడ్డి ఓటమి పాలవడం శ్రేణుల్ని ఆలోచనలో పడేసింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జరిగిన ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకోకపోవడం వెనక కారణాలపై పార్టీలో అంతర్గతంగా చర్చసాగుతోంది.
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ - ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి