Visakhapatnam Pathetic Situation: తగిన తోడ్పాటు అందిస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీపడే సత్తా విశాఖ నగరానికి ఉందట సీఎం జగన్ చెప్పారు. అందులో ఎవ్వరికీ ఆవగింజంతైనా సందేహం లేదు. సమస్యల్లా తోడ్పాటు గురించే! అధికారంలోకి విశాఖకు జగన్ ఇచ్చిన తోడ్పాటేంటి? కార్యనిర్వాహక రాజధాని అంటూ కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేయడం తప్ప ప్రత్యేకంగా ఒరగబెట్టారా?
ఇది టాలీవుడ్ సినీ పెద్దల్ని తాడేపల్లిలోని క్యాంపాఫీస్‌కు పిలిపించుకుని మరీ జగన్ చెప్పిన మాట. విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములిస్తారట! రామానాయుడు స్టూడియోకు 2003లో అప్పటి ప్రభుత్వం 35 ఎకరాల భూమి కేటాయిస్తే అందులో నుంచి 20ఎకరాలు లాగేసుకోవాలని చూసింది వైసీపీ సర్కార్. లేఔట్ వేసుకుని అమ్ముకోవాలని చూసింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగింది. ఇది విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ది చేయడమా? జరుగుతున్న అభివృద్ధిని ఆపేయడమా?
అసలు విశాఖ అంటనే పర్యాటకానికి పర్యాయపదం! దానికి కొండత అండ రుషికొండ. అలాంటి రుషికొండకు గుండుకొట్టించారు మన జగనన్న! రుషికొండ పచ్చదనంపై క్యాంపాఫీస్ పేరుతో కుంపటిపెట్టారు. పచ్చదనాన్ని విధ్వంసం చేశారు. రుషికొండపై గతంలో ఉన్న పర్యాటకకాటేజీల్నిపడగొట్టారు. పర్యాటకులు, విశాఖ వాసులు కాటేజీల్లో సరదాగా గడిపేవారు. అక్కడి నుంచి సాగరసోయగాల్ని వీక్షించేవారు.
ఇప్పుడక్కడ రిసార్ట్ పేరుతో సీఎం కోసం 430 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన క్యాంపు కార్యాలయం నిర్మించారు! మరి అందులోకి పర్యాటకుల్ని అనుమతిస్తారా? అక్కడ క్యాంపాఫీస్ నిర్మాణం మొదలైనప్పటి నుంచే అటువైపు అసాధారణ ఆంక్షలు విధించారు. దిగువన ఉన్న రుషికొండ బీచ్‌లోకి సందర్శకుల్ని ప్రస్తుతానికి అనుమతిస్తున్నా, సీఎం మకాం ఇక్కడకు మార్చితే అసలు ఆ ఛాయలకు రానిస్తారా? ఇది పర్యాటకపరంగా విశాఖను ముందుకు తీసుకెళ్లడమా? వెనక్కిలాగడమా?
వైసీపీ నేతల వేధింపులతో.. పరిశ్రమలు పరార్..
విశాఖ నోట్లో మట్టి: ఇక విశాఖ పర్యాటకానికి మరో ఆకర్షణ ఎర్రమట్టి దిబ్బలు. వాటినీ వైసీపీ నాయకులు విధ్వంసం చేసేస్తున్నారు. అంతేకాదు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాల్లో బౌద్ధమతం ఆనవాళ్లున్న ప్రదేశాలనూ వైసీపీ నాయకులు మట్టి, ఇతర అవసరాల కోసం విధ్వంసం చేస్తున్నారు. దీన్ని మమకారం చూపించడమంటారా? విశాఖ నోట్లో మట్టికొట్టడం అంటారా?
పర్యాటకాభివృద్ధే కాదు విశాఖ పారిశ్రామికాభివృద్ధికీ జగన్ చేసింది తీరని ద్రోహమే. విశాఖకు ఒడిలో వాలిన పెట్టుబడులను తరిమికొట్టారు! కొత్తగా తెచ్చిందేమీ లేకపోగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన లులూమాల్‌ను వెళ్లగొట్టారు. సాగరతీరంలో 15వందల కోట్లతో అంతర్జాతీయస్థాయి కన్వెన్షన్ సెంటర్, హోటల్ వంటివి నిర్మిస్తామంటే తెలుగుదేశం ప్రభుత్వం 9.12 ఎకరాల భూమి కేటాయించింది. ఒక ప్రైవేటు సంస్థకు చెందిన మరో 3.4 ఎకరాలు సేకరించి కూడా ఇచ్చింది.
అలాంటి లులూను జగన్ సాగరతీరం నుంచి సాగనంపారు! ఏకంగా భవిష్యత్‌లో ఏపీలో పెట్టుబడులే పెట్టబోమని లులూ ఛైర్మన్ దండం పెట్టేశారంటే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటుంది. జగన్ వద్దన్న లులూమాల్స్ ఇప్పుడు తమిళనాడు, తెలంగాణలో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదే విశాఖ నుంచి వెళ్లగొట్టకపోతే 5వేల మందికి ఉత్తరాంద్ర బిడ్డలకు ఉపాధి దక్కేది. ఇది విశాఖను ఉద్ధరించడమా? ఉపాధికి గండికొట్టడమా? సీఎం సర్?
Luxury Buildings in Visakhapatnam for CM Jagan: జనం సొమ్ముతో.. సీఎం జగన్ సోకులు!
షట్టర్లు మూసేసిన స్టార్టప్ కంపెనీలు: ఇక విశాఖ మిలీనియం టవర్! హైదరాబాద్‌కు సైబర్ టవర్స్‌లాగే విశాఖకు మిలీనియం టవర్స్‌ను సిగ్నేచర్‌గా మార్చాలనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిర్మిచింది. స్టార్టప్ విలేజ్‌గా నామకరణం చేసి కంపెనీల్ని రారమ్మని ఆహ్వానించింది. రాయితీలిచ్చి ప్రోత్సహించింది. అప్పట్లోవందకుపైగా రెక్కలు కట్టుకుని వాలిన స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు షట్టర్లు మూసేశాయి.
టీడీపీ హయాంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ విధానం కింద ఐటీ పార్క్‌లో సగం అద్దెకే కంపెనీలకు ఆఫీసు స్థలం, ఇంటర్నెట్, నిరంతర విద్యుత్ సదుపాయం కల్పిస్తే వైసీపీ ఆ పాలసీని నిలిపేసింది. ఇక్కడి ఐటీ కంపెనీలకు నాలుగేళ్లుగా 80 కోట్ల రూపాయల మేర బకాయిలు, ప్రోత్సాహకాలు పెడింగ్‌పెట్టింది. ఫలితంగా చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు విశాఖకు వీడ్కోలు చెప్పేశాయి. ఇక 3వేల500 మంది పనిచేసిన HSBC, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలూ విశాఖను వదిలిపోయాయి. ఇది విశాఖకు ఐటీ వెలుగులు తేవడమా? చీకట్లోకి నెట్టడమా?
పారిశ్రామికంగానూ విశాఖను పడకేయించారు జగన్. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఐదేళ్లలో కొత్తగా ఒక్క పారిశ్రామికవాడనూ ప్రారంభించలేదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రెవెన్యూ డివిజన్ మండలాల పరిధిలో 672 ఎకరాల్లో పారిశ్రామివాడల ఏర్పాటుకు నడుంకట్టారు. వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టింది. చేసిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసుకుంటూకాలం వెళ్లబుచ్చుతోంది. గత ప్రభుత్వం విశాఖలో 70 వేల కోట్ల పెట్టుబడితో 5 గిగావాట్‌ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో ఒప్పందం చేసుకుంటే, వైసీపీ వచ్చాక ప్రతిపాదన కాస్తా 21 వేల 844 కోట్లకు కుంచించుకుపోయింది.
విమానయాన రెక్కలు విరిచేయడం కాదా: గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన అదానీ డేటాసెంటర్‌కే 2023 మే 3న జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకూ పనులే మొదలుకాలేదు! భోగాపురం విమానాశ్రయ పరిస్థితీ అంతే. 2019 ఫిబ్రవరిలో జీఎంఆర్ సంస్థకు 2,700 ఎకరాలు కేటాయించి చంద్రబాబు శంకుస్థాపన చేస్తే జగన్ వాటిని 2వేల200 ఎకరాలకు తగ్గించి, 2023 మే 3న జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. రివర్స్ టెండర్ పేరుతో ఎయిర్‌పోర్టు నిర్మాణంలో జాప్యానికి కారణం అయ్యారు. ఇది విశాఖ విమానయాన రెక్కలు విరిచేయడం కాదా?
ఇక మౌలిక వసతులపరంగా విశాఖను మరో మెట్టెక్కించేదే మెట్రో! హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీపడాలంటే దాన్ని పట్టాలెక్కించాల్సిన అటకెక్కించారు. గత ప్రభుత్వం విశాఖలో 42కిలోమీటర్ల పొడవున 8వేల 300 కోట్ల రూపాయల వ్యయంతో లైట్ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌ని ప్రతిపాదించింది. డీపీఆర్ ఖరారు చేసి, PPP విధానంలో చేపట్టేందుకు అంతా సిద్ధం చేసింది.
అభివృద్ధిని ట్రాక్ తప్పించి: రుణమిచ్చేందుకు విదేశీ ఆర్థిక సంస్థలూ ఆసక్తి కనబరిచాయి. టెండర్లు పిలిచే సమయానికి ప్రభుత్వం మారింది! మొదట్లో 2020లో ప్రాజెక్టు ప్రారంభించి 2024కి పూర్తి చేస్తామని భ్రమలు కల్పించిన జగన్ సర్కారు, ఇన్నాళ్లూ ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు ఎన్నికల ఏడాది వచ్చేసరికి గత డిసెంబర్‌లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో DPR ఆమోదించారు! జనవరి 15న మెట్రోకి శంకుస్థాపనంటూ అనధికారిక ప్రచారమూ చేసుకున్నారు! అదీ జరగలేదు. ఇది విశాఖ అభివృద్ధిని ట్రాక్ తప్పించడం కాదా?
జగనన్నా ఇదేనా నీ చిత్తశుద్ధి - ఎన్నికల ముందు విశాఖ మెట్రో అంటూ ఎందుకీ హడావుడి?
రైల్వేజోన్‌ను పగటికలగా మార్చి: మెట్రోను అలా మూలనపడేసిన జగన్, విభజన హామీగా రావాల్సిన రైల్వోజోన్‌నైనా విశాఖకు తెచ్చిపెట్టారా అంటే అదీలేదు. విశాఖలో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలోనే కేంద్రం ప్రకటించింది. ఇంతవరకూ కార్యాలయాల నిర్మాణమే జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముడసర్లోవలో 52 ఎకరాలు అప్పగిస్తే రైల్వే జోన్ కార్యాలయాలు నిర్మిస్తామని రైల్వేశాఖ చెబుతోంది. ఆ భూముల్లో కొన్ని ఎకరాలకు సంబంధించి న్యాయపరమైనవివాదాలున్నాయని విశాఖ నగరపాలక సంస్థ అంటోంది. ప్రభుత్వం వాటిని పరిష్కరించనూలేదు! ప్రత్యామ్నాయమూ చూపలేదు. రైల్వేజోన్‌ను పగటికలగా మార్చింది జగన్ కాదా?
విశాఖ గమనాన్ని మార్చిన కర్మాగారం స్టీల్‌ప్లాంట్! దాని ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తుంటే జగన్ చేష్టలుడిగి చూస్తున్నారు! 2 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తే ఆ ప్లాంట్ నిలబడుతుంది! ప్రభుత్వ అవసరాలకు భారతి సిమెంట్‌ను తీసుకున్నట్లే, విశాఖ ఉక్కుని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలనే ప్రతిపాదనను జగన్ పట్టించుకోవడం లేదు. విశాఖ ఉక్కుకి విజయనగరం జిల్లాలోని గర్భాంలో ఉన్న మాంగనీసు గనుల లీజు గడువు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఉక్కు, బొగ్గు పార్లమెంటరీ కమిటీలో ఇద్దరు వైసీపీ ఎంపీలున్నా, విశాఖ ఉక్కుకి సొంత గనుల కోసం పట్టుపట్టకపోవం కేంద్రం మెడలు వంచడమా? కేంద్రానికి తలవంచడమా?
What Happened Visakha Steel Plant Sankalpam Jagan?: విశాఖ స్టీల్ ప్లాంట్ సంకల్పం ఏమైంది జగన్..?
ఇక విశాఖ నగరంలో అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలు శిలాఫలకాలుగానే మిగిలాయి. VMRDA, జీవీఎంసీలకు సంబంధించిన మొత్తం రూ.750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 2019 డిసెంబరు 28న జగన్ ఒకేసారి శంకుస్థాపన చేశారు. అవన్నీ నత్తకే నడక నేర్పుతున్నాయి. సిరిపురం వద్ద 11 అంతస్తుల మల్టీలెవెల్ పార్కింగ్, కాపులుప్పాడ వద్ద నేచురల్ హిస్టరీ పార్కు, మ్యూజియం, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కైలాసగిరి కొండపై ప్లానిటోరియం ఇవేమీ సాకారం కాలేదు. ఇలా జగన్ ఏలుబడిలో విధ్వంసం తప్ప విశాఖకు ఒరిగింది శూన్యమే! విశాఖపై వైసీపీ పెద్దలు గద్దల్లా వాలితే, అధికారపార్టీ రాబంధులు నంజుకుతింటుంటే, మిన్నకుండిపోయిన జగన్, ఇక్కడే మకాం వేసి ఉద్ధరిస్తాననడం విశాఖను మభ్యపెట్టడం కాదా?