Visakhapatnam Parliamentary Constituency : సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఉత్తరాంధ్రకు తలమానికంగా రాష్ట్రానికి ఆర్థికంగా పరిపుష్టం చేసే వనరులున్న ఈ నగరం తొలి నుంచి పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. పార్లమెంట్ పరిధిలో 20 లక్షల 12 వేల మంది ఓటర్లు ఉన్నారు. GVMC పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లే కాకుండా విజయనగరం జిల్లాలో ఉన్న S.కోట నియోజకవర్గం కూడా ఇందులోకే వస్తుంది. మొదట నుంచి ఇక్కడ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగానే ఉంటున్నాయి. 2019లో వైఎస్సార్సీపీ తరఫున రియల్టర్ , బిల్డర్ MVV సత్యనారాయణ స్వల్పమెజార్టీతో గెలుపొందారు. రియల్‌ఎస్టేట్ వివాదాలు, ఎంపీ కుటుంబాన్నేకిడ్నాప్ చేసిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో MVVని వైఎస్సార్సీపీ విశాఖ తూర్పు అసెంబ్లీ స్ధానానికి బదిలీ చేసింది. ఆయన స్థానంలో మంత్రి బొత్ససత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని బరిలోకి దింపింది. విజయనగరం ఎంపీగా ఝాన్సీ రెండు సార్లు పనిచేశారు. బొత్స కూడా విశాఖలోనే మకాం వేసి ప్రజల మద్దతు కూడగడుతున్నారు. తెలుగుదేశం అధిష్ఠానం శ్రీభరత్ నే మరోసారి బరిలోకి దింపింది. కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ యువ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
సూపర్ స్టార్‌ను గెలిపించి ఓడించిన ఏలూరు - నేడు ఉత్కంఠ రేపుతున్న పోరు - ELURU LOK SABHA ELECTIONS
విశాఖ తూర్పు: విశాఖ తూర్పు నియోజకవర్గం తొలి నుంచి తెలుగుదేశానికి కంచుకోటగానే ఉంది. వెలగపూడి రామకృష్ణబాబును మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ ఎన్నికల్లోనూ అధిష్ఠానం వెలగపూడినే బరిలోకి దింపింది. కాలనీలు, బస్తీ ప్రజలకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటారన్నది ఈయనకు బాగా కలిసివచ్చే అంశం. అటు మత్స్యకారులతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించుకోవాలని వైఎస్సార్సీపీ ఎత్తులు వేస్తోంది. M.V.V.ని రంగంలోకి దింపి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేయిస్తోంది.
విశాఖ పశ్చిమ: విశాఖ పార్లమెంట్‌లో అతి తక్కువ ఓటర్లు ఉన్న సెగ్మెంట్ విశాఖ పశ్చిమం. పారిశ్రామిక, మధ్యతరగతి, పేద వర్గాలు కలిసి ఉన్నప్రాంతం. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గణబాబు నాలుగోసారి టికెట్ దక్కించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. సౌమ్యుడిగా ప్రజలందరికి అందుబాటులోఉండే వ్యక్తిగా పేరుండటంతో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వైఎస్సార్సీపీ నుంచి అడారి తులసీరావు తనయుడు అడారి ఆనంద్ కుమార్ పోటీలో ఉన్నారు. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పౌరుషానికి ప్రతీక పల్నాడు గడ్డ - నర్సరావుపేట ఎవరి అడ్డా? - Narasaraopet LOK SABHA ELECTIONS
విశాఖ ఉత్తరం: విశాఖ ఉత్తరంలో 2014లో బీజేపీ నుంచి ఎన్నికైన విష్ణుకుమార్ రాజు తిరిగి ఈసారి కూటమి అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీలోకి దిగారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంపై ఉన్న పట్టు, క్యాడర్‌తో పరిచయాలు, వైఎస్సార్సీపీ అరాచకాలు ఎండగట్టడం బాగా కలసివస్తాయన్నది విష్ణుకుమార్ రాజు అంచనా. వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్న K.K.రాజు విష్ణుకుమార్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. కే.కే. ధన బలం, కండబలంతో ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
విశాఖ దక్షిణం: పాతనగరం విశాఖతో కలిసి ఉన్న దక్షిణ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మత్స్యకారులు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తారు. ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశానికి పట్టం గట్టారు. వాసుపల్లి గణేష్ కుమార్ ను గెలిపించినా తర్వాత వైఎస్సార్సీపీలో చేరి ఇదే నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగారు. కాగా, ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. కూటమి నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణయాదవ్ బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకుని వైఎస్సార్సీపీలో ఇమడలేక వంశీకృష్ణ జనసేనలో చేరి తలపడుతున్నారు. ఇంటింటి ప్రచారంతో వివిధ వర్గాల వారికి చేరువవుతున్నారు.
సాంస్కృతిక రాజధాని రాజమండ్రి - కాంగ్రెస్ కంచుకోటకు టీడీపీ బీటలు - Rajahmundry LOK SABHA ELECTIONS
గాజువాక : విశాఖలో అత్యంత ప్రముఖమైన పారిశ్రామిక ప్రాంతం గాజువాక. స్టీల్ ప్లాంట్ సహా భారీ పరిశ్రమలు ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నాయి. పారిశ్రామిక కాలుష్యం ప్రధాన సమస్యే అయినా అంతకు మించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అధిష్ఠానం రంగంలో నిలిపింది. 2014లో ఎమ్మెల్యేగా చేసిన ఈయన సౌమ్యుడిగా, విద్యాధికునిగా పేరుంది. వైఎస్సార్సీపీ ఆగడాలు ఎండగడుతూ సమస్యలపై పోరాడటం ఆయనకు ప్లస్ పాయింట్. వైఎస్సార్సీపీ తరఫున మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గం డీలా పడింది. ఇది ఆయనకు మైనస్‌గా చెప్పొచ్చు. తండ్రి గుర్నాథరావు పేరును చెప్పుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు అమర్నాథ్.
భీమిలి : ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే భీమిలి నియోజకవర్గ ఓటర్లు ఈసారి గంటా శ్రీనివాసరావు తిరిగి ఇక్కడి నుంచి పోటీకి దిగడం శుభపరిణామంగా భావిస్తున్నారు. పట్టుబట్టి ఇక్కడ టికెట్‌ను దక్కించుకున్న గంటా నేతలందర్నీ చాకచక్యంగా తనవైపు తిప్పుకొన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తానంటూ ప్రత్యర్థుల్లో దడ పుట్టించారు. వైఎస్సార్సీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు మళ్లీ బరిలో ఉన్నారు. మంచి మిత్రులుగా ఉన్న గంటా, అవంతి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఓటమి లేని నేతలుగా గుర్తింపు ఉన్న వీరిద్దరికి ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి.
అంతుచిక్కని సింహపురి రాజకీయం - ఎవరిని వరించేనో విజయం - Nellore LOK SABHA ELECTIONS
ఎస్.కోట : తెలుగుదేశానికి మంచి పట్టున్న నియోజకవర్గంలో S.కోటకు ప్రత్యేక స్థానం ఉంది. విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ పరిధిలోనిది. గతంలో 2014లో ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ల లలిత కుమారి 2019 ఓటమి చవిచూసినా వైఎస్సార్సీపీ ఆగడాలను ఎత్తిచూపుతూ నిత్యం ప్రజల్లో ఉండటంతో మళ్లీ ఆమెకు అధిష్ఠానం టిక్కెట్టు కట్టబెట్టింది. ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కే వైఎస్సార్సీపీ మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. సమస్యలేవీ పరిష్కారం చేయలేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదార్ల ఓట్లపైనే ఈయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.
విశాఖపై వల్లమాలిని ప్రేమ చూపిన జగన్ మాటలతో మాయచేశారే తప్ప చెప్పుకోదగ్గ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. పారిశుద్ధ్యం, చెత్త డంపింగ్, సముద్ర కాలుష్యం, పోర్టు కాలుష్యం నిత్యం పలుకరిస్తున్నా ఎంపీ పట్టించుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పర్యాటకులను రప్పించే ప్రాజెక్టులను తీసుకురాలేదు. హెలీటూరిజాన్ని అటకెక్కించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి కధ ఒక్కరోజులోనే ముగించేశారు. రుషికొండకు బోడిగుండు కొట్టి టూరిస్ట్ గెస్ట్ హౌస్ పేరిట రూ.500 కోట్లు వెచ్చించి విలాసవంతమైన భవనాలే నిర్మించారు. మెట్రో రైలు , రైల్వే జోన్ సాకారం కాలేదు. స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం ప్రతిపాదనను తీసుకురావడంతో కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. అడుగడుగునా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.