Botsa Satyanarayana, Praveen Prakash Irregularities in Jagananna Vidya Kanuka? : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉద్యోగం వెలగబెట్టిన ప్రవీణ్ ప్రకాశ్ సహా కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాలదందాకుతెరతీశారు.
2024-25 విద్యా సంవత్సరానికి విద్యా కానుక కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనకు తెగించారు. ఆర్థిక శాఖ అనుమతి, మంత్రివర్గ ఆమోదం, చివరకు సీఎం పేషీ అంగీకారం లేకుండా, న్యాయ సమీక్షకు పంపకుండా, టెండర్లు లేకుండా 772 కోట్ల రూపాయల కాంట్రాక్టును బొత్స, ప్రవీణ్ ప్రకాశ్ కలిసి ఖరారు చేశారు. పాత ధరలతో పాత గుత్తేదారుకే రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడా, ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇవ్వడం అనుమానాలకు ఊతమిస్తోంది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఆ నిర్ణయాన్ని ర్యాటిఫై చేయించుకోవచ్చనే అతివిశ్వాసంతోనే బరితెగించినట్లు తెలుస్తోంది. ఐతే, కూటమి అధికారంలోకి రావడం, బొత్స కూడా ఓడిపోవడంతో తనకు ఇబ్బందులు తప్పవని ప్రవీణ్ ప్రకాశ్ భయపడినట్లు తెలుస్తోంది. అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై విచారణ జరిపించాలని మంత్రి లోకేశ్‌కు ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
విద్యాకానుక కిట్ల మాటున 121 కోట్ల రూపాయలు హాంఫట్-విజిలెన్స్ హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉంటుందని తెలిసినా, అప్పటి మంత్రి, ఆ శాఖ అధికారులు తొలుత పట్టించుకోలేదు. టెండర్లు లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన దస్త్రాన్ని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్ తిప్పి పంపారు. ఆ ఫైల్‌పై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా రాశారు. దాన్ని కూడా బొత్స, ప్రవీణ్ ప్రకాశ్ పట్టించుకోలేదు. క్యాబినెట్‌లో దీన్ని టేబుల్ ఐటమ్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా వారించారు.
ఆర్థిక శాఖ అభిప్రాయం అప్పటికే ఆ ఫైల్‌పై రాసి వెనక్కి పంపినందున టేబుల్ ఐటమ్‌గా పెట్టడం సరికాదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతి కోసం పంపగా, అక్కడా అనుమతి లభించలేదు. కానీ మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాశ్ ఇద్దరూ వారి స్థాయిలో దస్త్రాన్ని ఆమోదించేశారు. జనవరి 10న పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు తప్ప, మిగతా 772 కోట్ల విలువచేసే సామగ్రిని పాత గుత్తేదార్లకే రిపీట్ ఆర్డర్ ఇవ్వాలంటూ జీవో జారీ చేశారు. పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లకు టెండర్లు నిర్వహించాలని పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు.
100 కోట్ల రూపాయలకు పైబడిన కాంట్రాక్టులను ముందే న్యాయసమీక్షకు పంపుతామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో జగన్ గొప్పగా ప్రకటించారు. ఐతే 772 కోట్ల రూపాయలతో విద్యా కానుకలు కొనుగోలు చేసే దస్త్రం విషయంలో జ్యుడీషియల్ ప్రివ్యూ నిబంధన పాటించలేదు. ఏదైనా వస్తువు కొనుగోలు చేశాక, నెలా, రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ కొనాల్సి వస్తే రిపీట్ ఆర్డర్ ఇవ్వడం సాధారణం. మార్కెట్‌లో ఆయా వస్తువుల ధరలు తగ్గితే, తగ్గిన రేట్ ప్రకారం, పెరిగితే పాత ధరల ప్రకారం ఆర్డర్ ఇవ్వాలి.
కానీ 2022లోని ధరలనే 2024లోనూ ఖరారు చేశారు. తగ్గిన పేపర్ ధరలను పరిగణనలోకి తీసుకోలేదు. గతేడాది నోటు పుస్తకాలను ఇద్దరు గుత్తేదార్లు సరఫరా చేయగా, ఈసారి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన రాయలసీమకు చెందిన ఓ గుత్తేదారుకు ఆర్డర్ ఇచ్చారు. భారీగా లబ్ధి పొందిన ఆయన, దానికి ప్రతిఫలంగా ఓ మాజీ మంత్రికి ఎన్నికల ముందు నిధులు సమకూర్చారనే ఆరోపణలున్నాయి.
Jagananna Vidya Kanuka Kits: జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపకుండానే టెండర్లు.. భారీగా ప్రజాధనం వృథా