Voters Problem in Tribal Areas : ఎన్నికల రోజునా ఆ గిరిజనులకు పాట్లు తప్పలేదు. ఓటు వేయడానికి డోలీ మోతలే దిక్కయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గ ప్రజలు ఓటు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతగిరి మండలం బూరుగు చిన్న కొండ గ్రామం నుంచి డోలీ మోసుకుంటూ ఓటర్లు ప్రయాణించారు. వృద్ధులను, అనారోగ్యంగా ఉన్నవారిని సుమారు 10 కిలోమీటర్లు డోలీమోసి రొంపలి పోలింగ్ కేంద్రానికి తీసుకు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇదే దుస్థితి ఉందని, ఓట్లు వేసేటప్పుడు మాత్రం అది చేస్తాం ఇది చేస్తామంటున్నారే గానీ ఏమీ చేయటం లేదని వాపోయారు. ప్రస్తుతానికి ఓటు వేయడానికి కూడా మాకు ఈ పాట్లు తప్ప లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంగా ఉన్నా, సంతలకు వెళ్లాలన్నా నిత్యం పది కిలోమీటర్ల మేర కొండలు గుట్టలు దాటాల్సి వస్తోందని చెప్తున్నారు.
ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలం ఇందిరమ్మ కాలనీ భరత్ నగర్ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. కాలనీలో మురుగు కాల్వలు ఏర్పాటు చేయకపోవడం, సీసీ రోడ్లు వేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యలు పరిష్కరించే వరకు తాము ఎవరికి ఓటు వేయమని భీష్మించారు.