Transfers in Various Departments: ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలను ప్రభుత్వం వేగవంతం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకే చోట మూడేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులు, అధికారుల బదిలీలు చేయాల్సిందిగా ఈసీ ఆదేశించటంతో ఆ మేరకు బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఈసీ జారీ చేసిన సూచనలు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టినట్టు ప్రభుత్వం తెలియచేసింది.
సొంత జిల్లాలో పనిచేస్తున్న, ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి, జూన్ 30 తేదీతో మూడేళ్లు పూర్తి అవుతున్న వారికీ బదిలీ చేస్తూ వేర్వేరు విభాగాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఎన్నికల విధుల్లో అక్రమాలపై క్రమశిక్షణా చర్యలు పెండింగ్ లో లేని అధికారులు, ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వారు, ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయని అధికారులను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ సూచనలు ఇచ్చింది.
ఒకే జిల్లాలో పదోన్నతి పొందినా అంతకుముందు సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. మున్సిపల్ శాఖలో 92 మందిని బదిలీ చేస్తూ ఆ శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. అటు ఎక్సైజ్ శాఖలోనూ భారీ సంఖ్యలో బదిలీలు చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31 లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తహశీల్దార్ల బదిలీ
మరోవైపు ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే పలుమార్లు ఏపీ సీఎస్ కేఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద అంతర్గతంగానూ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇప్పటికే కొన్ని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ప్రత్యేకంగా పోలీసు శాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పించాల్సిందిగా సీఎస్ సూచించారు.
దీంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైనా కొద్ది రోజుల ముందు సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పని సరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు లైట్లు, ఫ్యాన్లు, త్రాగునీరు, ఫర్నీచర్, టాయిలెట్లు ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు అక్రమ మద్య రవాణాను అరికట్టటంతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు, చెక్ పోస్టులు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలోని కేసులపై ఛార్జిషీట్ల దాఖలు తదితర అంశాలను సమీక్షించారు.
ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష - రెండు రోజుల్లో బదిలీలు పూర్తి చేయాలని ఆదేశం