Tellam Venkata Rao likely To join Congress party : లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala) ఆధ్వర్యంలో ఇల్లందులో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా భద్రాచలం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొనటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.
భద్రాచలం శాసన సభ్యుడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లుగానే కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కొంతకాలంగా సొంత పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యహహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఛలో మేడిగడ్డ కార్యక్రమం, పార్లమెంట్ ఎన్నికల(PARLIAMENT Election) సన్నద్ధత సమావేశాలకు దూరంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన తెల్లం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చారు. ఇటీవల మణుగూరు కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తమతో కలిసి నడుస్తానంటూ వచ్చారని తెలిపారు.
తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరికకు(Joinings In Congress) ముహూర్తం ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ సభలోనే రాహుల్ గాంధీ సమక్షంలో తెల్లం వెంకట్రావు హస్తం గూటికి చేరుతారని తెలుస్తోంది. ఇందు కోసం భద్రాచలం నుంచి తనతో పాటు నాయకుల్ని తీసుకుని వెళ్లేందుకు తెల్లం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. తెల్లం కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తప్పేలా లేదు.
తెల్లం వెంకట్రావు రాజకీయ అడుగులు కాంగ్రెస్‌లో రేపో మాపో చేరిక అన్నట్లుగానే సాగుతున్నప్పటికీ ఆయన మాత్రం పలుమార్లు తాను పార్టీ మారడం లేదంటూ ఖండిస్తూ వస్తున్నారు. మణుగూరులో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఎమ్మెల్యే మౌనం దాల్చారు. ఇందుకు ఊతమిచ్చేలా మంగళవారం ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహబూబాబాద్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై మరోసారి చర్చకు తావిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశానికి హాజరై కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలందరితో కలివిడిగా ఉన్నారు. పార్టీ నేతలతో మంత్రి తుమ్మల నిర్వహించిన అంతర్గత సమావేశంలో, ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలోనూ తెల్లం పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - కుటుంబసమేతంగా సీఎంతో భేటీ