Telangana Cabinet Meeting Today : కీలక అంశాలే అజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. జీవో 317, ఉద్యోగుల పెండింగ్ డీఏతో పాటు ఇతర అంశాలపై చర్చించనుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ కులగణన షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశముంది. కొత్త ఆర్వోఆర్ బిల్లుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎకో టూరిజం పాలసీ, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లు, భూ కేటాయింపులతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
భారీ అజెండాతో కూడిన అనేక అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీ ఈ నెల 23న నిర్వహించాలని భావించినప్పటికీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు విదేశీ పర్యటన కారణంగా ఇవాళ్టికి వాయిదా వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ ఆమోదించనుంది.
స్పౌస్, అనారోగ్యం, వితంతువుల కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని జీవో 317 బాధితులను బదిలీ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలపై మంత్రివర్గం తీపి కబురు అందిస్తుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ధాన్యం సేకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. మిల్లింగ్ ఛార్జీల పెంపు, బ్యాంకు గ్యారంటీలు, తేమ ధాన్యం కొనుగోళ్లు, డీఫాల్టర్లపై చర్యలు సహా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్త ఆర్వోఆర్ బిల్లుపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌ను భూమాతగా పేరు మార్పు, గ్రామానికో రెవెన్యూ అధికారి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. త్వరలో జరిగే బీసీ కులగణన షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. నూతన ఎకో టూరిజం పాలసీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎకో టూరిజం కమిటీ ఇటీవలే ముసాయిదాను సిద్ధం చేసి సీఎంకు సమర్పించింది. మూసీ నిర్వాసితులకు పునరావాసం, ఆర్థిక సాయం, 5 కంపెనీల కన్సార్టియం తయారు చేసే డీపీఆర్, మంత్రుల సియోల్ పర్యటనపై చర్చ జరగనుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో సిబ్బంది కేటాయింపు, నిధులు, విధులు, పరికరాల కొనుగోలు అంశాలపై కేబినెట్ దృష్టి సారించనుంది.
పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కేంద్రం నుంచి అందాల్సిన వరద సాయం, ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెంచుకునే మార్గాలు సహా వివిధ అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించే అవకాశం ఉంది. మూసీపై అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం, ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.