Congress Ministers in charges Lok Sabha Constituency : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మిషన్-15 లక్ష్యంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహరచనను అమలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆయన మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకొంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కొందరు మంత్రులకు పరీక్షగా మారింది.
TS Lok Sabha Elections Challenge to Ministers : మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ లోక్‌సభ బాధ్యతను అప్పగించారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. దీంతో ఆమె ఆదిలాబాద్‌పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ప్రకటించిన ఐదు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి చెబుతున్నారు.
Congress Leaders Election Campaign : మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్ లోక్‌సభ సీటు బాధ్యతలను అప్పగించారు. ఈ నియోజకవర్గ పరిధిలోనూ మెదక్ సెగ్మెంట్లో మాత్రమే పార్టీ గెలిచింది. ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య చివరి వరకు పోటీ నెలకొనగా, పొంగులేటి సూచించిన ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డికే టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది. గ్యారంటీల అమలు, అసెంబ్లీ ఫలితాల జోష్ నిలుపుకునేలా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది.
వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచారం : ఇతర నియోజకవర్గాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు తమ సొంత నియోజకవర్గాలను వదిలిపెట్టకుండా రెండింటిపైనా దృష్టి సారించారు. కొందరు మంత్రులు తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి ఇంఛార్జ్‌గా ఉన్న దామోదర్ రాజనరసింహ మెదక్ పార్లమెంట్ స్థానంలోనూ సమన్వయం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పరిధిలో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు 19,000ల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మిగిలిన మంత్రులు కూడా తమకు అప్పగించినవాటితో పాటు తాము తోడ్పాటు అందించగలిగిన నియోజకవర్గాలపైనా దృష్టి పెట్టి ప్రచారాలకు వెళ్తున్నారు.
తీవ్రంగా శ్రమిస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు : అలాగే స్థానిక ఎమ్మెల్యేలు సైతం పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యధిక స్థానాల్లో గెలుపే దిశగా అడుగులు వేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు తమ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. బూత్‌స్థాయి నుంచి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభ్యర్థులతో సభలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేయించే బాధ్యత బీసీలు తీసుకోవాలి : వీహెచ్ - V Hanumantha Rao Comments on Modi