Telangana Congress Strategy on MP Elections : రాష్ట్రంలో నాలుగు విడతల్లో 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, మరో మూడింటికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా కూడా ప్రచారంపై దృష్టి సారించింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను, సీనియర్ నాయకులను ఇంఛార్జ్‌లుగా నియమించిన రాష్ట్ర నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో కదలికలు తీసుకొచ్చే దిశలో ముందుకు వెళ్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లుగా నియమితులైన మంత్రులు, సీనియర్ నేతలు, ఆయా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Lok Sabha Elections 2024 : నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలను అంచనా వేసే దిశలో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులతో ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా హస్తం పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థులతో సమీక్ష నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్(BRS) నేతల బలాబలాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని, హస్తం పార్టీ తమ ఖాతాలో వేసుకునేందుకు చురుకైన పాత్ర పోషిస్తూ చొరవ చూపుతోంది.
Telangana Congress MP Candidates 2024 : ఏఐసీసీ(AICC) రూపకల్పన చేసిన మేనిఫెస్టోతో పాటు గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, పరిమితికి మించి చేసిన అప్పులు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన తీరును గడపగడపకు తీసుకెళ్లి, బీఆర్ఎస్ వైఖరిని ఎండకట్టేలా యోచిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ పరంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజల వద్దకు తీకుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం అవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు సమీక్ష నిర్వహించుకుని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశలో చర్యలు చేపట్టనున్నారు.
తుక్కుగూడలో భారీ బహిరంగ సభ : ఏఐసీసీ కీలకంగా భావిస్తున్న పాంచ్ న్యాయ గ్యారంటీలకు విస్తృతమైన ప్రచారం కల్పించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తుంది. కాంగ్రెస్ చెప్పింది చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేట్లు పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటికే పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. గత సెప్టెంబర్ 17న నగర శివారు తుక్కుగూడ కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆరు హామీలను హస్తం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) చేతుల మీదుగా ప్రకటన చేయించారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సెంటిమెంట్‌తో తిరిగి అక్కడనే ఈనెల ఆరో తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
ఇంఛార్జ్‌ల సన్నాహక సమావేశాలు : ఇప్పటికే తుక్కుగూడ(Tukkuguda)లో ఏర్పాట్లను కాంగ్రెస్ ప్రారంభించింది. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం తుక్కుగూడ సభా ప్రాంగణానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా నాయకులతో సమాలోచనలు చేశారు. సభ ఏర్పాట్లపై అవసరమైన సలహాలు సూచనలు నేతలకు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి ఎంతమందిని సభకు తరలించాలన్న అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు. మండలాల వారీగా నిర్దేశించిన సంఖ్య తరలివచ్చేట్లు ముందస్తుగా ఈ సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Congress Strategy on Lok Sabha Elections : తుక్కుగూడ కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీతో పాటు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం మరి కొంతమంది జాతీయ నాయకులు పాల్గొంటారని హస్తం పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాళ్లకి అప్పగించిన పనిని చేయాలని రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. భారీ బహిరంగ సభ ఏర్పాట్ల విషయంలో కానీ, సౌకర్యాలు కల్పనలోకాని రాజీ పడవద్దని సీఎం స్పష్టం చేశారు.
పెద్ద సంఖ్యలో మహిళలను తరలించాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం ఇందుకోసం సీతక్క, సురేఖ ఇద్దరు మహిళా మంత్రులతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ అనిత రెడ్డి, బడంగ్‌పేట మేయర్ పారిజాత రెడ్డిలకు బాధ్యతలను అప్పగించారు. ఆరో తేదీన జరగనున్న సభ కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేందుకు నాయకులంతా కలిసికట్టుగా పని చేసి సభను విజయవంతం చేస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది.
తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇంఛార్జులు నియామకం - TS Congress Parliament Incharge