Telangana Congress Lok Sabha Election Plan : తెలంగాణ రాష్ట్రంలో లోకసభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పూర్తిగా పార్లమెంటు ఎన్నికలపైనే రాష్ట్ర నాయత్వం దృష్టి సారించింది. నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల్లో చురుకుదనం పెంచే దిశలో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి నియోజక వర్గ నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా శుక్రవారం రోజున కూడా అందుబాటులో ఉన్న ముఖ్యనాయకులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, గతంలో తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేసినప్పుడు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు రాష్ట్రమంతటా అమలు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి, పార్లమెంటు నియోజక వర్గ స్థాయి, అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి, మండల స్థాయి, బూతుస్థాయి, ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు తదితర వాటిపై చర్చించారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఏఐసీసీ మేనిఫెస్టో (Congress Lok Sabha Manifesto)ను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. లోకసభ ఎన్నికల్లో ఎవరు ఎలా పని చేశారో, అన్న విషయం ఎన్నికల తర్వాత స్పష్టం అవుతుందని సీఎం నొక్కి చెప్పారు. పనితీరును బట్టే పార్టీ కార్యవర్గంలో, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు.
CM Revanth on MP Elections 2024 : లోకసభ ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో పాలనాపరమైన అంశాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిలతోపాటు మరికొందరు నాయకులు అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీలకు చెందిన అసంతృప్తి నాయకులతో మంతనాలు జరుపుతూ వారిని హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే వీరి మంతనాలు ఫలించడంతో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి (Chevella Congress MP Candidate Ranjit Reddy), వికారాబాద్ సిట్టింగ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వీరు కాకుండా మరింత మందిని పార్టీలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉండడంతో బయట పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకుని టికెట్లు కూడా ప్రకటించారు.
బీఆర్ఎస్ ఖేల్ ఖతమ్ - నెక్స్ట్ బీజేపీకి అదే గతి : సీఎం రేవంత్ రెడ్డి - Lok Sabha Elections 2024
Telangana Lok Sabha Election 2024 : లోకసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో నాలుగు, రెండో విడతలో మరో అయిదుగురకి టికెట్లు ప్రకటించారు. మొత్తం 17 స్థానాలకు కనీసం 14 (Telangana Congress MP Candidates 2024) స్థానాలైన చేజిక్కించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. బలమైన నాయకత్వం లేని చోట పార్టీని బలోపేతం చేసే దిశలో ఏఐసీసీ అనుమతితో పక్కా కార్యాచరణ అమలు చేస్తోంది.
ఇప్పటికే ప్రకటించిన 9 స్థానాలు కాకుండా మిగిలిన ఎనిమిది స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకాభిప్రాయం తీసుకొచ్చి అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా గెలుపునకు మరింత సానుకూలత ఉంటుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. భువనగిరి (Bhuvanagiri MP Ticket) పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి తనకు టికెట్ వస్తుందని క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకలాపాలు చేసుకుంటూ పోతుండగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడం వల్లనే ఆ స్థానం ప్రకటించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన సతీమణి పోటీ చేయడం లేదని, స్పష్టత ఇవ్వడతో లైన్ క్లియర్ అయ్యినట్లు సమాచారం.
Congress Lok Sabha Candidates 2024 : మరోవైపు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదిలాబాద్ నుంచి సుగుణ, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవేన్ రెడ్డి, మెదక్ నీల మధు, వరంగల్ పసునూరి దయాకర్‌కాని, దొమ్మాటి సాంబయ్యకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి సుప్రీం న్యాయవాది షహనాజ్ పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్ధి ఎంపిక కొంత క్లిష్టంగా ఉండడంతో ఏఐసీసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీలైనంత త్వరగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించి మిగిలిన ఎనిమది స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించేందుకు వీలుగా కసరత్తు కొనసాగుతోంది.
లోక్సభ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు - పార్టీలు మారుతున్న నేతలు
కొలిక్కిరాని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ - ఆరు సీట్లపై ఏకాభిప్రాయం