CM Revanth Reddy on Parliament Elections 2024 : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రచార కార్యక్రమాలకే పరిమితమైన సీఎం రేవంత్‌రెడ్డి, కోడ్ ముగియటంతో ఇక పరిపాలనపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రక్రియ, ఫలితాలు, పరిపాలన, మున్ముందు తీసుకోబోయే నిర్ణయాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవటంతో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని ఇక పరిపాలనపై దృష్టి పెడుతున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు.
రైతు రుణమాఫీ చేసి తీరుతాం : అసెంబ్లీలో చర్చించకుండా విధానపరమైన నిర్ణయాలను అమలు చేయబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి ఆదాయం వచ్చేలా వనరులు సమకూర్చి, సేకరించిన అప్పులతో అన్నదాతల రుణాలు చెల్లిస్తామని వెల్లడించారు. రైతు పెట్టుబడి, గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు కర్షకులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.
'పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, ఇతరత్రా మౌళిక సౌకర్యాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. పాఠ్యాంశాల విషయంలో కమిషన్ వేస్తామని, అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే, అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, చర్చిస్తామని లేదంటే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
"రైతులు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ఇస్తాం. గతంలో మాదిరి ఎక్కువ నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది. అయితే, ఏయే వస్తువులు రేషన్ దుకాణం నుంచి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందో కసరత్తు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నాం. మూసీ ప్రక్షాళనపై కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తాం. కేసీఆర్ మాదిరిగా నేను అపరమేధావి కాదు. ప్రతి అంశంపై కసరత్తు చేసిన తరువాతే నిర్ణయాలు ఉంటాయి." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Focus on Governance : హైదరాబాద్‌ను యూటీ చేస్తారని ప్రచారం చేయటం తెలివితక్కువ తనమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేసినా, రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తెలంగాణ రాజధానికి ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం అక్కడ విమానాశ్రయాన్నీ నిర్మించనున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు రేవంత్‌రెడ్డి వివరించారు.
'కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఒకే చోట ఉండకూడదు. అందుకే రీజినల్ రింగ్ రోడ్డు వస్తే అవుటర్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మాసిటీలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రాభివృద్ధికి ప్రాంతీయ రింగ్ రోడ్డు కీలకం కానుంది. రేడియల్ రహదారులు ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో మండలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్దీకరించాలి. ఆ తర్వాతే జిల్లాల అంశాన్ని పరిశీలిస్తాం. పదేళ్లలో 100 సంవత్సరాలకు సరిపడే ప్రణాళికను అందించడమే లక్ష్యంగా తాను పని చేస్తున్నట్లు' రేవంత్‌రెడ్డి తెలిపారు .
రేషన్‌కార్డులది నిరంతర ప్రక్రియ : రాష్ట్రంలో 65 ఐటీఐలను టాటా సంస్థ రూ.1800 కోట్లతో పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలల విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రేషన్‌కార్డులు ఇవ్వడానికి ఎలాంటి పరిమితి లేదని, అది నిరంతర ప్రక్రియగా రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీకి 220కి పది అటోఇటో సీట్లు వస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. కంటోన్మెంట్ ఉపఎన్నికలో కనీసం 20,000ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 9 నుంచి 13 స్థానాల వరకు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు ఆరేడు చోట్ల డిపాజిట్లైనా రావన్న రేవంత్‌రెడ్డి, మెదక్‌లో కమలం పార్టీ మూడో స్థానంలో ఉంటుందన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ పని చేసి ఉంటే, ఎన్ని స్థానాలొస్తాయనేది సులభంగా అంచనా వేయవచ్చని, చాలా చోట్ల భారత్ రాష్ట్ర సమితి శ్రేణులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేశాయన్నారు.
అలాంటి వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు : కొందరు కావాలనే విద్యుత్ అంతరాయం సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న సీఎం, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించారని, అలాంటి వారిపై ఎఫ్ఐఆర్‌లు సైతం నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా, వారితో వైరం ఉండదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు.