TDP - YSRCP Clash in Kadapa: సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. రెండేళ్ల నుంచి కడపలోని మోచంపేటకు చెందిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరినొకరు పార్టీ కార్యక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకుని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంశంపై ఇవాళ మోచంపేటలో టీడీపీ కార్యకర్త అరీఫ్, వైసీపీ కార్యకర్త షేక్ పీరుల్లా మధ్య గొడవ జరిగింది.
ఈ ఘర్షణలో వైసీపీ కార్యకర్తకు గాయమైంది. ఈ అంశం కడపలో రెండు పార్టీలో నేతల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు పార్టీల నేతలు కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. టీడీపీ తరపు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తన అనుచరులతో పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడారు. అదే సమయంలో కడప మేయర్ సురేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అనుచరులు స్టేషన్కు వచ్చారు.
దీంతో ఈ సమయంలో ఇరువురు అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత మంత్రి సోదరుడు అహ్మద్ బాషా సమక్షంలో పార్టీ కార్యకర్తలు స్టేషన్ ఎదుటే బైఠాయించి ఆందోళన చేశారు. టీడీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారు.
శ్రీనివాసుల రెడ్డి ఇంటికి వచ్చి కొడతాం, ఏం చేస్తాడో చూస్తాం, ఏం పీక్కుంటాడో పీక్కోమను అనే విధంగా మరింత బూతు పురాణాన్ని మంత్రి సోదరుడు అహ్మద్ బాషా పోలీస్ స్టేషన్ ఎదురుగానే మీడియాతో మాట్లాడారు. పోలీసులు అంతా చూస్తుండగానే టీడీపీ నేతపై రెచ్చేగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.
శ్రీనివాసుల రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేస్తామనే విధంగా అహ్మద్ బాషా మాట్లాడినా కూడా పోలీసులు నిస్సహాయులుగా చూస్తూ ఉండిపోయారు. అహ్మద్ బాషా మాటలకు శ్రీనివాసుల రెడ్డి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇంటికి వస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని శ్రీనివాసుల రెడ్డి మండిపడ్డారు.
ప్రచారం కోసం పెట్టిన పోస్టర్లను సైతం చింపేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాడులకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దానిని ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే వారిని కూడా భయపెడుతున్నారని అన్నారు. తన ఇంటిపైన దాడి చేస్తామని అంటున్నారని, అధికారం ఉందని విర్రవీగుతున్నారని శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల నుంచి ఫిర్యాదులు తీసుకుని విచారణ జరుపుతున్నామని డీఎస్పీ షరీఫ్ తెలిపారు.
YCP Leaders Attack on TDP Workers : ఆదోనిలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తల దాడి