TDP Win Survey in Andhra Pradesh Elections 2024: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టో రూపొందిస్తున్నాయి. మరో వైపు పొత్తులు సైతం ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకోగా వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నాడీని ముందుగానే అంచనా వేస్తున్నాయి పలు సర్వే సంస్థలు. ఆజ్ తక్ - సీ ఓటర్ సర్వే ఏపీలో తెలుగుదేశం - జనసేన హవా కొనసాగుతుందని జోస్యం చెప్పాయి. దీనిపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తనదైన శైలిలో స్పందిస్తూ వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారు.
Nara Lokesh Tweeted Aaj Tak-C Voter Survey Details: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP)కి గట్టి షాక్ తగలబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ (TDP) 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. వైఎస్సార్సీపీ 8 స్థానాలకు పరిమితం కానుంది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంతిమ యాత్ర పక్కా అంటూ ఆజ్ తక్ - సీ ఓటర్ సర్వే వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందనటానికి తాజా సర్వే ఫలితాలే నిదర్శనంగా పేర్కొన్నారు. ఆజ్ తక్ - సీ ఓటర్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 45శాతం ఓటర్లు తెలుగుదేశం - జనసేనతోనే ఉన్నారని స్పష్టమైందన్నారు. తెలుగుదేశం - జనసేన కూటమి 17ఎంపీ స్థానాలను గెలవబోతున్నాయని, వైఎస్సార్సీపీ 41శాతం ఓట్లతో దక్కిందుకునేది 8 ఎంపీ సీట్లేనని లోకేశ్ తెలిపారు.
కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం - జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: చంద్రబాబు
India Today Mood of the Nation Survey in AP: ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి షాక్ తగలనుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం వెల్లడించింది. 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు సర్వే నిర్వహించినట్లు తెలిపింది.
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించి 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కానున్నాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. 45 శాతం ఓటింగ్‌తో టీడీపీ 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందని పేర్కొంది. వైసీపీ 41 శాతం ఓటింగ్‌తో 8 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది.
తెలంగాణలో కాంగ్రెస్ జోరు: ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఈసారి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. 17 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీకి 3, బీఆర్ఎస్కు 3, మజ్లిస్ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3, మజ్లిస్ ఒక సీటు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభలోనూ అదే జోరు కొనసాగిస్తూ ఏడు స్థానాలు పెంచుకోనుందని సర్వే అంచనా వేసింది. బీఆర్ఎస్ భారీగా సీట్లు తగ్గనున్నట్లు తెలిపింది. బీజేపీ ఒక ఎంపీ సీటు కోల్పోనుందని తెలిపింది.