TDP Ticket Aspirants Met Chandrababu: తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో టిక్కెట్‌లు దక్కనివారు, ఆశావహులు, అసంతృప్త నేతలు ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు చంద్రబాబుని కలిశారు. పొత్తులో భాగంగా జనసేన(Janasena)కు సీట్లు కేటాయించడంతో పాటు, ఇతర కారణాలతో టిక్కెట్‌లు ఇవ్వలేని నాయకులతో చంద్రబాబు స్వయంగా మాట్లాడుతున్నారు.
ఏ కారణం వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయారో వివరిస్తున్నారు. పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. టిక్కెట్ ఇవ్వలేదంటే పార్టీ వారిని వద్దనుకున్నట్టు కాదని, సర్వేలు, సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరిగిందని వారికి వివరిస్తున్నారు.
ఎన్నికల సమరానికి సై- టీడీపీ, జనసేన 'జెండా' సభకు సర్వం సిద్ధం
అనంతపురం జిల్లాలోని శింగనమల అసెంబ్లీ స్థానాన్ని బండారు శ్రావణికి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవ్‌రెడ్డి, నర్సానాయుడుని చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. విభేదాలు పక్కనపెట్టి శ్రావణి గెలుపునకు కృషి చేయాలని వారికి సూచించారు. రాయచోటి టిక్కెట్ రాంప్రసాద్‌రెడ్డికి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ ముఖ్యనేత ప్రసాద్(Prasad)నూ పిలిపించారు.
రాంప్రసాద్‌రెడ్డి, ప్రసాద్‌లను కూర్చోబెట్టి మాట్లాడారు. ఇద్దరు నేతలూ చేతులు కలిపి సీటు గెలుచుకుని రావాలని సూచించారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినందున ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజుని పిలిపించారు. అక్కడ జనసేన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని, పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా(Former MLA Chandbasha)చంద్రబాబుని కలసి కదిరి అసెంబ్లీ టిక్కెట్ తనకివ్వాలని కోరారు.
అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైసీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు
కడప లోక్‌సభ టికెట్ ఆశిస్తున్న రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని జయచంద్రారెడ్డికి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, అనంతపురం లోక్‌సభ టిక్కెట్ ఆశిస్తున్న జేసీ పవన్‌రెడ్డి తదితరులు చంద్రబాబుని కలిశారు.
జనసేనతో పొత్తు వల్ల తెనాలి సీటుని కోల్పోయిన తనకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని మాజీమంత్రి ఆలపాటి(Former Minister Alapathi) ఇప్పటికే చంద్రబాబుని కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను ఆలపాటి కలిశారు. నెల్లూరు జిల్లాలో వచ్చే నెల రెండో తేదీన చంద్రబాబు పర్యటనపై చర్చించేందుకు మాజీమంత్రి నారాయణఆయనను కలిశారు. అదే రోజున నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశంలో చేరుతారని నారాయణ తెలిపారు.
నిన్న ఫుల్ - నేడు నిల్ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్'