Lepakshi lands: లేపాక్షి భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ కోరారు. జగన్ ఏలుబడిలో చేసిన మోసాలన్నీ బయటపడుతున్నాయన్న ఆయన విపరీతంగా అప్పులు తీసుకురావటం ఏ ప్రభుత్వ హయాంలో లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన భూములను కాజేసేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు. దిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీకి 2,650 ఎకరాలు సొంతం చేసుకోకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
గత ఐదేళ్లలో జగన్ రెడ్డి 8,844 ఎకరాల లేపాక్షి భూముల్ని కేవలం 500 కోట్ల రూపాయలకు కారుచౌకగా కొట్టేయాలని ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. లేపాక్షి భూముల వేలం విషయంలో జగన్ గత 5 సంవత్సరాల్లో ఏ ప్రయత్నం చేయకపోగా, తన బంధు మిత్రులకు ఆ భూములను కట్టబెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందూ బ్యాంకుల్లో కుదవబెట్టిన 4,190 ఎకరాలను బ్యాంకర్లు కన్సార్టియంతో 4 వేల కోట్ల అప్పుకుగాను కేవలం 501 కోట్లను వేలంలో పెట్టారని ఆక్షేపించారు. మరో 2650 ఎకరాలను దిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ అనే సంస్థకు కేవలం 28 కోట్ల రూపాయలకి కట్టబెట్టేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసులో ట్రిబ్యునల్, ఎపీఐఐసీ, ఈడీని కూడా ఇంప్లీడ్ చేసుకోడానికి నిరాకరించడం ఆశ్చర్యకరమన్నారు. ట్రిబ్యునల్‌లోని లేపాక్షి వేలం కేసులో ఇప్పుడు ఎపీఐఐసీ, ఈడీ రెండూ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బ్యాంకుల్లో 4190 ఎకరాల భూమితో పాటు హైదరాబాద్ లోని 36 ఎకరాల విలువైన ప్రైవేటు భూములను కూడా చేర్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఉన్న ప్రైవేటు భూములు అమ్మితే ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికీకరణ కోసం భూములు ఎంతో అవసరమని గుర్తుచేశారు. లేపాక్షి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అవి రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయని విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వేల ఎకరాలను బొక్కేందుకు కుట్రపన్నారని, లేపాక్షి భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
వైఎస్సార్సీపీ సర్కార్ వైఫల్యం - ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ - YSRCP Victims at Praja Darbar