TDP Parliamentary Party Meeting Today : పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఎంపీలతో సీఎం భేటీ కానున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రుల్నీ ఆహ్వానించారు.
ఇప్పటికే ఒక్కో ఎంపీకి బాధ్యతలు : కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవలసిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషితో పాటు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయం కోసం ఎంపీలతో పాటు మంత్రులనూ సమావేశానికి పిలిచారు. కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మంత్రుల్ని కూడా వారికి జతచేయనున్నారు.
రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవడంతో పాటు, జలజీవన్ మిషన్, కృషి సించాయీ యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అదేవిధంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై సూచనలు చేయనున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేంద్రం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించనున్నారు.