TDP Flexis Removed at Chandrababu House: తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను చూసినా అధికార వైసీపీ నేతలు సహించలేకపోతున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కనిపిస్తే చాలు అధికారులను అడ్డు పెట్టుకుని ఏదో ఒక విధంగా తొలగిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కరకట్టపై ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. మున్సిపల్ సిబ్బందిని వెంట తీసుకొచ్చి, హోర్డింగ్‌లను తొలగించి పక్కన పడేసి వెళ్లారని పార్టీ నేతలు ఆరోపించారు. అయితే కరకట్టపైనే ఉన్న వైసీపీ ఫ్లెక్సీల జోలికి మాత్రం వెళ్లలేదు. అధికారుల తీరు పట్ల తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బొమ్మతో ఉన్న వైసీపీ ఫ్లెక్సీలు అధికారులకు కనిపించట్లేదా అని నేతలు మండిపడ్డారు.
అధికార పార్టీ ఫ్లెక్సీలకే అవకాశం!- పేర్ని నాని ఆదేశాలతో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు
TDP Flexis Removed: అయితే కేవలం ఇవి మాత్రమే కాదు. రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. మంగళవారం మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని ఆదేశాలతో తెలుగుదేశం ఫ్లెక్సీలను పురపాలక సిబ్బంది తొలగించారు. మచిలీపట్నంలో పలుచోట్ల టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు తెలియజేస్తూ కొల్లు రవీంద్ర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని సహించకలేని పేర్ని నాని వాటిని వెంటనే తొలగించాలంటూ పురపాలక సిబ్బందికి తెలియజేశారు.
అంతే ఇక్కడ కూడా మున్సిపల్ అధికారులు వైసీపీ ఫ్లెక్సీల జోలికి పోలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మాత్రం తొలగించారు. ఈ విషయం టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగిస్తే ఇరుపార్టీల ఫ్లెక్సీలను తొలగించాలి కానీ ఇలా అధికార పార్టీ ఫ్లెక్సీలు ఉంచి, టీడీపీవి మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
నిత్యం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబ శివరావు ఫ్లెక్సీ చించివేసిన ఘటన బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఇసుక దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం జరిగింది. క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీని వైసీపీ నేతలు చించివేశారు. దీనిపై టీడీపీ అభిమానులు ఆందోళనకు దిగారు.
పులివర్తి నాని ఫ్లెక్సీల తొలగింపు- టీడీపీ, వైసీపీ కార్యకర్తల వాగ్వాదం