YSRCP Target Pawan Kalyan : వైఎస్సార్సీపీలో గ్రూపు రాజకీయాలు వేడెక్కాయి. కార్యకర్తలు, నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలను ఏ మాత్రం లెక్కచేయని అధిష్ఠానం ఇష్టారాజ్యంగా బదిలీలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు తాడేపల్లి వేదికగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా రెబల్ అభ్యర్థులను పిలిపించి బుజ్జగిస్తున్నారు. 'అధికారంలోకి వస్తే' అంటూ పదవులు ఆశ చూపిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పిఠాపురం సీటుపై వైసీపీ అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే తాయిలాల పంపిణీ కొనసాగుతుండగా మాజీలను ఓదార్చే పనిలో నిమగ్నమైంది. జనసేన నేత మాకినీడి శేషుకుమారి (Makinidi Seshu Kumari) ని పార్టీలో చేర్చుకున్న జగన్ తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును పిలిపించుకుని మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి వస్తే పదవి ఇస్తామని చెప్తూ పార్టీ విజయానికి పాటు పడాలని కోరారు.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
పిఠాపురం నుంచి అసెంబ్లీ కి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం (Kapu community leader Mudragada) సహా పలువురు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను పిఠాపురం ఇన్‌చార్జీగా నియమించిన జగన్ నిన్న పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన జనసేన నేత మాకినీడి శేషుకుమారిని పార్టీలో చేర్చుకున్నారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పిలిచి బుజ్జగించారు. ఈ సారి పెండెం దొరబాబుకు పిఠాపురం టికెట్ ఇవ్వని సీఎం వైఎస్ జగన్ దొరబాబు స్థానంలో వంగా గీతను బరిలో నిలిపారు.
జగన్‌రెడ్డీ బీసీలకేది 'ఆదరణ' - వైఎస్సార్సీపీ నేతల ఆవేదన
ఈ నేపథ్యంలో టికెట్ ఇవ్వకపోవడంతో కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న పెండెం దొరబాబు (Pendem Dora Babu) ఇటీవల జన్మదిన వేడుకలు నిర్వహించి బలప్రదర్శన చేశారు. ఇదే వేదికగా అసంతృప్తి వెల్లడించారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పిలిపించి బుజ్జగించారు. వంగా గీతను గెలిపించుకు రావాలని, భవిష్యత్తులో భర్తీ చేసే పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు - భవిష్యత్ ఆలోచించి నిర్భయంగా ఓటేయాలి: జేపీ
ఇదే సమయంలో పలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు, అసంతృప్తుల వ్యవహారాల పరిష్కారంపైనా సీఎం దృష్టి పెట్టారు. పలు నియోజకవర్గాల అభ్యర్థులను సీఎంవోకు వైసీపీ నేతలు పిలిపించి చర్చిస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సీఎంవోకి వచ్చి మంతనాలు జరిపారు. నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులపై చర్చించిన పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి వారికి మార్గ నిర్దేశం చేశారు.
ఎంపీ బాలశౌరితో వంగవీటి రాధా భేటీ- జనసేన నుంచి ఎన్నికల్లో పోటీ!