Stone Attack on Jagan : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఆధ్వర్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. డీసీపీ ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ఆరు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరించారు. ప్రచార సమయంలో స్థానికులు తీసిన వీడియోలతో పాటు సమీప సెల్ టవర్ నుంచి వెళ్లిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలను తెప్పించుకుని విశ్లేషించారు. ఈ మేరకు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
రాయి దాడి ఘటనపై ముఖేష్ కుమార్ మీనా సమీక్ష- దర్యాప్తును వేగం చేయాలని సూచన - AP CEO Mukesh Kumar Meena
జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుల వివరాలు చెప్తే పారితోషికం ఇస్తామని విజయవాడ సీపీ కాంతిరాణా వెల్లడించడం తెలిసిందే. నిందితుల వివరాలు, ఫొటోలు, వీడియోలు ఇచ్చిన వారికి 2 లక్షల నగదు పారితోషకం ఇస్తామని ఆయన ప్రకటిస్తూ సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో వడ్డెర కాలనీకి చెందిన పలువురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
జగన్‌పై రాయి దాడి: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడి దగ్గర వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద సీఎం జగన్ బస్సు యాత్ర సాగుతుండగా ఆయనపై రాయి పడింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి స్వల్ప గాయమైంది. ముఖ్యమంత్రికి ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగిసిన తర్వాత భారతీరెడ్డి అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు.