NDA Leaders Election Campaign: ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. జగన్ హయాంలో వెనుకబాటును గుర్తు చేస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భగా స్థానిక సమస్యలపై దృష్టి సారించిన నాయకులు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి తరఫున ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్థానికంగా నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నూరు శాతం అక్షరాస్యత పెంపొందించేలా ఓ మహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నామని, చదువు పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉన్నాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. అందువల్లనే ఎన్నికల అనంతరం తాను, ఎంపీ కేశినేని చిన్ని తో కలిసి నియోజవర్గ స్థాయిలో 22 డివిజన్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి యువత యువకుల ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ పరిధిలో సుజనా చౌదరి విస్తృత ప్రచారం కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ కొండ ప్రాంతాలపై నివసించే వారికి డ్రైనేజీలు, ఇతర సౌకర్యాలు ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి కల్పించక పోవడం దారుణమని పేర్కొన్నారు. తాను అధికారంలో రాగానే ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మోడల్ ప్రాంతాలుగా వీటిని రూపుదిద్దే బాధ్యత చేపడతానని పేర్కొన్నారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం ఇచ్చిన ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఏమాత్రం అడుగు కూడా ముందుకు పడలేదని, ప్రజలు ఎప్పుడెప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిపి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు పాల్గొన్నారు.