Statewide Unemployed Worried About DSC Notification : ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ దగా డీఎస్సీ ఇచ్చారని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులను మోసం చేసిన సీఎం జగన్‌కు తగిన బుద్ధి చెబుతామని ఉద్ఘాటించారు.
జగన్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసింది: యూటీఎఫ్
Vijayawada : ప్రభుత్వం ప్రకటించిన దగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు కదం తొక్కారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ ఇచ్చారని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సీఎం నివాసం ముట్టడికి యత్నించారు. తాడేపల్లి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిన విద్యార్థి సంఘం నేతలు ఒక్కసారిగా సీఎం నివాసం వైపు దూసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి మంగళగిరి స్టేషన్‌కు తరలించారు.
నిరుద్యోగ యువత తరపున పోరాడుతున్న ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వద్ద అరెస్టు చేసి మంగళగిరికి స్టేషన్‌కు తరలించిన ఏబీవీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు.
దగా డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీ కావాలి - సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన ఏఐవైఎఫ్ కార్యకర్తల అరెస్టు
Nellore District : నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఇంటిని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. పొదలకూరు రోడ్డు నుంచి ప్రదర్శనగా వెళ్లి మంత్రి నివాసం ఎదుట బైఠాయించారు. దగా డీఎస్సీ మాకొద్దు మెగా డీఎస్సీ కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మంత్రి ఇంట్లో లేకపోవడంతో దాదాపు గంటన్నరపాటు అక్కడే ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. పోలీసులు, యూత్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదాలతో ఉద్రిక్తత నెలకొంది.
సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేశారు : టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్
Anantapur District : అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ (TNSF), ఏఐవైఎఫ్ (AIYF) నేతలు ఎన్టీఆర్ భవన్ నుంచి టీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి (RDO Office) వెళ్లి, అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్డీవోకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.