YCP leader irregularities in Vizianagaram: విజయనగరం జిల్లాలోని ఆ ప్రజాప్రతినిధి పేరులో దేవుడి పేరున్నా, చేసేవన్నీ అక్రమాలే. నియోజకవర్గంలో ఎవరైనా పెద్ద వ్యాపారం ప్రారంభిస్తే అందులో వాటా అయినా ఇవ్వాలి. లేదంటే ఆయన నడిపించే చిట్‌ఫండ్ సంస్థలో చిట్టీ అయినా కట్టాలి. కాదూ, కూడదంటే అధికార బలంతో ఇబ్బందులు సృష్టించి వేధిస్తారు. స్థిరాస్తి లేఅవుట్‌లకు అనుమతులు కావాలంటే తొలుత ఈ నాయకుడికి సంబంధించి కౌంటర్ 1, కౌంటర్ 2 అని పిలిచే ఇద్దరు వ్యక్తుల్ని కలవాల్సిందే.! వారు చెప్పినట్లుగా చిట్‌ఫండ్ సంస్థలో కనీసం 50 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన చిట్టీ వేయాల్సిందే.
నియోజకవర్గంలో వివాదాస్పద భూముల సమాచారం తెప్పించుకోవడం, ఇరువర్గాల్ని సెటిల్‌మెంట్‌కు పిలిచి చివరకి ఆ భూమిని తానే నామమాత్రపు ధరకు కొట్టేయడం.. ఆయన స్టైల్.! పోలీసుస్టేషన్‌కు వెళ్లే ఒకటీ అరా భూతగాదాలను సైతం తన వద్దకే రప్పించుకొని పంచాయితీలు చేస్తుంటారు. జూట్ మిల్లులకు సంబంధించిన స్థలాలు అమ్మి కార్మికులకు బకాయిలు చెల్లించటానికి యాజమాన్యాలు సిద్ధపడగా ఈ నాయకుడు బినామీ పేర్లతో వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. వాటిల్లో స్థిరాస్తి లేఅవుట్‌లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ వందల కోట్లు పలుకుతోంది.
రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ, రిజిస్ట్రేషన్లు తదితర ప్రభుత్వ శాఖల్లో, ఈ ప్రజాప్రతినిధి చెప్పిందే జరుగుతుంది. తన ఆదేశాలు పాటించే అధికారులనే, అక్కడికి తెచ్చిపెట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పాసు పుస్తకాల జారీ, మ్యుటేషన్లు వంటివి ఏం చేయాలన్నా ఈ నాయకుడి అనుమతి తప్పనిసరి. కోటి దాటిన ప్రతి రిజిస్ట్రేషన్ లావాదేవీ ఆయన దృష్టికి వెళ్లాల్సిందే. వాటిని అడ్డం పెట్టుకుని యజమానుల నుంచి ఎంతోకొంత వసూలు చేస్తారు. ఇటీవల ఓ వైద్యుడు భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా, ముందు వెళ్లి ప్రజాప్రతినిధిని కలవాలనీ, ఆయన అనుమతిచ్చాకే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెప్పడంతో నివ్వెరపోవడం వైద్యుడి వంతైంది.
ఈ నాయకుడి ప్రధాన వృత్తి వడ్డీ వ్యాపారమే. అధిక వడ్డీలకు అప్పులు మీద అప్పులిచ్చి, తీసుకున్నవారు ఆ ఊబిలో చిక్కుకుపోయేలా చేస్తారు. తీర్చలేం బాబోయ్ అనేస్థాయికి తీసుకెళ్లి ప్రతిగా వారికి సంబంధించిన ఆస్తులు రాయించేసుకుంటారు. ఈ దందా ఎప్పటి నుంచో ఉన్నా, ఈ ఐదేళ్లలో పతాక స్థాయికి చేరింది. విజయనగరంలోని ఓ థియేటర్ యజమాని వ్యాపార నిర్వహణ కోసం ఈ నాయకుడి వద్ద అప్పు చేయగా, అసలు, వడ్డీ కింద ఆయన ఏకంగా ఆ థియేటర్‌నే సొంతం చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ స్థలం భారీ ధర పలుకుతోంది. చెప్పుకొంటూ పోతే, ఈ నేత అరాచకాలు కోకొల్లలు.
జగనన్న వదిలిన బాణం వైసీపీనే పొడుస్తోంది - కూటమి విజయం ఖాయం: పృథ్వీ - Prithviraj Met Nara Lokesh
ఈ ప్రజాప్రతినిధి దందాల్లో ఆయన అల్లుడిదీ ప్రధాన పాత్ర. స్థిరాస్తి వ్యాపారులెవరైనా ఈ ప్రజాప్రతినిధితో పాటు అల్లుడికీ ముడుపులు సమర్పించుకోవాల్సిందే. అతడినీ ప్రసన్నం చేసుకుంటేనే వారి వ్యాపారాలకు అనుమతులు లభిస్తాయి. లేదంటే ఏదో ఒక అడ్డంకి కల్పిస్తూనే ఉంటారు. నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల ఓ యువకుడు గంజాయితో పట్టుబడ్డాడు. తన ఫోన్‌లో ఈ ప్రజాప్రతినిధి అల్లుడుతో కలిసి దిగిన ఫొటోలు బయటకురావడం సంచలనమైంది. నియోజకవర్గ కేంద్రంలోని బార్‌లు, రెస్టారెంట్లన్నింటికీ ఈ ప్రజాప్రతినిధే రింగ్ లీడర్. అక్కడ ఆయన అమ్మిందే ధర చెప్పిందే రేటు. ప్రతి వ్యాపారి నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తుంటారు. జాతీయ రహదారిని ఆనుకుని చెల్లూరు ఆటోనగర్‌లో ఉన్న భూములను దౌర్జన్యంగా దక్కించుకున్నారు.