BRS in Medak Parliament in Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలు ఉత్కంఠభరితంగా వెల్లడయ్యాయి. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా చెరో ఎనిమిది స్థానాలు సాధించగా బీఆర్ఎస్ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. తెలంగాణలో గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్‌లోనూ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 32 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 3 లక్షల 96 వేల 790 ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు.
తెలంగాణలో మెదక్ లోక్‌సభ స్థానం 2004 నుంచి 2019 వరకు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉంటూ జరిగిన ప్రతి ఎంపీ ఎన్నికల్లో ప్రతిసారి గులాబీ జెండా రెపరెపలాడింది. ఇక్కడ ఎంపీగా ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేది. మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈసారి ఎంపీ ఎన్నికల్లో మెదక్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి గెలుపుపై భారీగా అంచనా వేశారు. ఆయన ప్రచారంలో చేసిన రూ.100 కోట్ల ట్రస్టు గురించి ఆ నియోజకవర్గంలో చర్చగా మారింది. పైగా ఆయన మాజీ కలెక్టర్ కావడంతో ఇతర పార్టీలు సైతం మెదక్ స్థానంపై గురిపెట్టి పోటాపోటీగా ప్రచారాలతో హోరెత్తించాయి.
1952లో ఆవిర్భవించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం : మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తరుఫున విస్తృతంగా ప్రచారం చేశారు. మెదక్ స్థానం బీఆర్ఎస్కు అత్యంత కీలకంగా భావించి, తప్పనిసరిగా ఇక్కడ గెలిచే దిశగా అభ్యర్థి ఎంపిక దగ్గరి నుంచి విజయం వరకు వ్యూహాలు రచించింది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటికి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట్లో మెదక్, ఆందోలు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది.
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ స్వరూపం మారింది. దీని పరిధిలోని ప్రస్తుతమున్న సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చి చేరాయి. 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆమెకు, 15,077 ఓట్లు వచ్చాయి. మెదక్ ఎంపీగా ఉంటూనే ప్రధాని పదవిలో కొనసాగుతూ 1984 అక్టోబరు 31న మరణించారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోటగా ఉంటూ ఇవాళ వెలువడిన ఫలితాలతో తీవ్ర నిరాశకు గురైంది.
కారు కనబడుట లేదు - లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోర పరాజయం - lok sabha election results 2024
ఈ ఫలితాలు చాలా నిరాశపరిచాయి : లోక్‌సభ ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్ - KTR Tweet On Election Results