Six BRS MLCs Joined Congress in Telangana: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్‌లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా కూడా హడావుడి లేకుండా, ఎలాంటి ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఎమ్మెల్సీల చేరిక జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాసు మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, దండె విఠల్, ఎం.ఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్ సమావేశమైన వారు రాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. సీఎం దిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం చకచకా పూర్తయింది.
ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలోదానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య ఉన్నారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం.
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, జీవన్‌రెడ్డి ఉన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలో చేరగా, తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరడంతో మండలిలో అధికారపార్టీ బలం మరింత పెరిగింది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ బలం 71కి చేరింది. మరో ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన మరో ఐదారుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ శాసనసభాపక్షం వీలినం చేసుకోవడానికి అవసరమైన మేర ఎమ్మెల్యేలను చేర్చుకునేలా కాంగ్రెస్ నాయకత్వం ముందుకెళ్తోంది.