RTC Employees Violated Election Code : జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ రుణం తీర్చుకోవాలంటూ ఆర్టీసీ డిపోలు, గ్యారేజీలు, బస్టాండ్లకు వెళ్లి ప్రచారం చేసిన ప్రజా రవాణాశాఖ వైఎస్‌ఆర్ ఉద్యోగుల సంఘం నేతలపై వేటు పడింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య సహా నలుగుర్ని ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డితో కలిసి పీటీడీ వైఎస్‌ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రయ్య తదితరులు కడప, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోల్లో గత నెల 31న ప్రచారం నిర్వహించారు. అక్కడి ఉద్యోగులు, మెకానికల్ సిబ్బంది, అధికారులను కలిసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులై ఉండి అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన తీరుపై "ప్రభుత్వ ఉద్యోగులా? వైఎస్సార్సీపీ నాయకులా?" అనే శీర్షికతో "ఈనాడు"లో ఈ నెల 2న కథనం ప్రచురితమైంది. దీంతో వీరిపై ఇప్పటికే కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్, బద్వేల్ స్టేషన్లలో కేసు నమోదైంది. తాజాగా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి వెంకట్రామిరెడ్డి వెంట ప్రచారంలో ఎవరెవరున్నారనే వివరాలు సేకరించి, బుధవారం చర్యలు తీసుకుంది. పీటీడీ వైఎస్‌ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన తిరుపతి డిపో అసిస్టెంట్ మేనేజర్ చల్లా చంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడప డిపోకు చెందిన ఎస్.బి.ఫక్రుద్దీన్, బద్వేలు డిపోలో ఆ సంఘం కార్యదర్శిగా ఉన్న కండక్టర్ ఎ.సుందరయ్య, ప్రొద్దుటూరు డిపో ఉద్యోగి రామచంద్రయ్యలను అధికారులు సస్పెండ్ చేశారు.
వైసీపీతో అంటకాగుతున్న కీలక అధికారులు!- చర్యలపై ప్రతిపక్షాల డిమాండ్ - No Actions on Key Officers
వెంకట్రామిరెడ్డి, చల్లా చంద్రయ్యతో కలిసి ఆదివారం ప్రచారంలో పాల్గొన్న వారిలో తిరుపతి డిపోనకు చెందిన కె.అర్జున్, జి.నర్సింహులు, తిరుమల డిపోనకు చెందిన జీవీ ముని, బనగానపల్లి డిపో ఉద్యోగి బి.శ్రీపతి, కడప ఆర్‌ఎం కార్యాలయం ఏవో రామ్‌లక్ష్మణ్ తదితరులున్నారు. వీరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఆయనపై చర్యలు ఉండవా? : "ప్రజా రవాణాశాఖ మిత్రులారా.. ప్రభుత్వ రుణం తీర్చుకోండి" అంటూ తన పేరిట ముద్రించిన రెండు పేజీల కరపత్రాలను ఆర్టీసీ ఉద్యోగులకు పంచి, దర్జాగా ప్రచారం నిర్వహించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పెద్దలకు ఎంత సన్నిహితుడైతే మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా చర్యలు ఎందుకు తీసుకోరు? కేవలం ఆర్టీసీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా అని నిలదీస్తున్నారు.
వృత్తి ప్రభుత్వ ఉద్యోగం - చేసేది జగన్‌కు ఊడిగం? - Violating Election Code