CM Revanth MP Nomination Rally in Bhongir : ప్రపంచం తలకిందులైనా రుణమాఫీని ఆపమని, ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం, మూడు లక్షల మెజారిటీతో చామలను గెలిపించి దిల్లీకి పంపాలని కోరారు. భువనగిరి కోట, కాంగ్రెస్ కంచుకోట అని ఎన్నోసార్లు ఇక్కడ ప్రజలు నిరూపించారన్న ఆయన, యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే కేంద్ర సర్కార్, కేసీఆర్ గత పాలనపై తీవ్రంగా మండిపడ్డారు. నాడు ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్‌లోకి ఎవరికీ ప్రవేశం ఉండేది కాదని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ కంచెలు కూలాయని తెలిపారు. సీఎం పదవిని తాను ఏనాడూ గర్వంగా భావించలేదని, బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు.
"పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తన పరివారాన్ని, పోటీలో అభ్యర్థులుగా నియమించుకున్నారు. ఇప్పుడేమో సామాజిక వర్గాల వారిని నిలబెట్టి ఓట్లు దండుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గొల్లకురుమలను మోసం చేసేందుకే భువనగిరి నియోజకవర్గంలో క్యామ మల్లేశ్‌ను పోటీలో నిలిపి, వెనుక నుంచి కుమార్తె కవిత బెయిల్ కోసం బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకొని కాషాయ పార్టీకి మద్దతు ఇవ్వాలని అంటున్నారు." -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలాయి : మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయని, వ్యవస్థలను చెరబట్టి విపక్షాలను బెదిరించేందుకు మోదీ అధికారాన్ని వాడుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. ఎన్నో రైతు ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులను కేసీఆర్ ఏనాడూ గౌరవించలేదన్న ఆయన, మోదీ ప్రభుత్వాన్ని దించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి వచ్చారని వివరించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మోదీకి మద్దతిచ్చిందని, కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు గులాబీ పార్టీ ఎంపీలు జై కొట్టారని తెలిపారు.
CM Revanth Fires on KCR : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద బిడ్డలెవరికీ ఉద్యోగాలు రాలేదన్న రేవంత్‌రెడ్డి, కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చారని దుయ్యబట్టారు. అలానే 30లక్షల మంది యువతను పట్టించుకోలేదని ఆక్షేపించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని సీఎం ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన మోదీకి, ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.
ఆంధ్రాలో కాంగ్రెస్‌కు నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేసిందని, వచ్చే పంటలో వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చామల నామినేషన్ ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.