Railwaykodur Janasena MLA Candidate Change in AP : ఏపీలోని రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని మారుస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థానంలో మెుదట యనమల భాస్కరరావు పేరు ప్రకటించినప్పటికీ, క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పరిశీలించారు. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన పవన్ కల్యాణ్ యనమల స్థానంలో అరవ శ్రీధర్ పేరు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మండలి బుద్దప్రసాద్‌కు అవకాశం: ఆంధ్రాలోని కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్యెల్యే టిక్కెట్‌ను మండలి బుద్దప్రసాద్‌కు కేటాయిస్తున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసినది. ఈ నెల ఒకటో తేదీన మండలి బుద్దప్రసాద్ పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు మండలి బుద్దప్రసాద్‌ను జనసేన పార్టీ ఎమ్యెల్యే అభ్యర్ధిగా ప్రకటించడంతో అవనిగడ్డలో మండలి నివాసంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. మండలి బుద్దప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి రావడంతో అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో చాలా క్రియాశీలమైనది. ఇక్కడ గెలుపొందిన ఎమ్యెల్యేకు ఆయా పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందడం ఆనవాయితీగా వస్తోంది. మండలి బుద్దప్రసాద్ అయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు దివిసీమ అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేసారు. ప్రజల సమస్యలు, రైతుల సమస్యలపై మండలి బుద్దప్రసాద్ అనేక పోరాటాలు చేసారు. అవనిగడ్డ నియోజకవర్గంను గతం కన్నా ఇంకా అభివృద్ధి చేస్తానని మండలి చెబుతున్నారు. మండలి భారీ మెజారిటీతో గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జనసేన పార్టీకి కేటాయించడంతో: గత కొన్ని నెలలుగా అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్యెల్యే అభ్యర్ధుల ఎంపిక విషయంలో రోజుకో అభ్యర్ధి పేరు సోషల్ మీడియాలో రావడంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఇప్పటికే ప్రకటించిన లిస్టుల్లో అవనిగడ్డ పేరు లేకపోవడంతో రాష్ట్రంలో ప్రజల దృష్టి అంతా అవనిగడ్డపై పడింది. మండలి బుద్దప్రసాద్ తెలుగుదేశం పార్టీలో ఉండగా పొత్తులో భాగంగా అవనిగడ్డ ఎమ్యెల్యే సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో గత రెండు నెలలుగా అనేక తర్జన భర్జనలు పడటం, తెలుగుదేశం స్థానిక నాయకులు కార్యకర్తలు మండలి బుద్దప్రసాద్‌కు తెలుగుదేశంపార్టీ తరపున టిక్కెట్ కేటాయించాలని అనేక ఆందోళనలు, ఈ నేపథ్యంలో జనసేనలో చేరిన మండలికి తాజాగా ఆ పార్టీ తరఫున టికెట్ కేటాయిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్