Rahul Gandhi Comments on Phone Tapping Case : గత సీఎం ఎలా పనిచేశారో మీకందరికీ తెలుసు, ఆయన వేలాది ఫోన్లు ట్యాప్(Phone Tapping) చేయించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత సీఎం రెవెన్యూ, ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేశారని అన్నారు. ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా మూసీ నదిలో పడేశారని ధ్వజమెత్తారు. వ్యాపారులను బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అప్పుడు రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిందే కేంద్రంలో ప్రధాని మోదీ(PM Modi) చేస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాహుల్ గాంధీ అనంతరం మాట్లాడారు.
మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీలు ఉన్నాయని, ఎక్కడికైనా మోదీ వచ్చేముందే ఈడీ వస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. కంపెనీలను ముందు సీబీఐ, ఈడీ బెదిరిస్తుందని చెప్పారు. ఈడీ, సీబీఐ రాగానే ఆ కంపెనీ బీజేపీ బాండ్లు(Election Bonds Issue) కొంటుందని వివరించారు. మోదీ కేవలం 3 శాతం మంది ధనికుల కోసం మాత్రమే పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలనూ కూడా స్తంభింపజేశారని ఆవేదన చెందారు.
కాంగ్రెస్‌కు సెంటిమెంట్‌గా మారిన తుక్కుగూడ - పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా జనజాతర
Congress Jana Jatara Sabha at Tukkuguda : దేశంలోనే బీజేపీ అతిపెద్ద వాషింగ్ మెషీన్‌గా మారిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలోని అవినీతి పరులంతా మోదీ పక్కనే చేరారని దుయ్యబట్టారు. ఈసీ(Central Election Commission)లోనూ మోదీ మనుషులు ఉన్నారని, ఎలక్టోరల్ బాండ్ల పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల జాబితా చూస్తే ఏం జరిగిందో మీకే అర్థమవుతోందని వివరించారు.
దేశంలో 50 శాతం జనాభా బీసీలు, 15 శాతం ఎస్సీలు, 8 శాతం ఎస్టీలు, 15 శాతం మైనార్టీలు ఉన్నారని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ లెక్కన చూస్తే దేశంలో 90 శాతం బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు. దేశంలోని అనేక సంస్థల్లో మాత్రం ఈ 90 శాతం బడుగులు కనిపించరని వివరించారు. ఏ పెద్ద కంపెనీ యజమానుల్లోనూ ఈ 90 శాతంలోని పేదలు కనిపించరని తెలిపారు. కేంద్రంలో 90 మంది ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురే బీసీలు ఉన్నారని పేర్కొన్నారు. జనాభాలో ఓబీసీ(OBC) లు 50 శాతం, ఐఏఎస్‌లలో మాత్రం 3 శాతం వాటా అని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు పెట్టేది కేవలం ఆరు శాతం మాత్రమేనని అన్నారు.
"గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపించారో. వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటెలెజెన్స్, పోలీసులు వ్యవస్థలను దుర్వినియోగం చేసి అందరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే డేటాను మొత్తం కూడా మూసీ నదిలో పడేశారు. గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి, బలవంతపు వసూళ్లు చేశారు. రాత్రి పూట ఫోన్ కాల్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పని మొదలు పెట్టింది నిజం మీ ముందు ఉంచుతుంది." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం : రాహుల్ గాంధీ
కేసీఆర్ పొగరు వల్లే బీఆర్‌ఎస్ పార్టీ 104 ఎమ్మెల్యేల నుంచి 39కి చేరుకుంది : మంత్రి ఉత్తమ్