Protest to YSRCP MLa Candidates : ఎన్నికల వేళ ప్రచారానికి (Election Campaign 2024) వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలకు ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రచారం నిర్వహించిన మాజీమంత్రి కొడాలి నాని ముందు ప్రజలు సమస్యల చిట్టా విప్పారు. ఐదు నెలలుగా తాగునీరు రావట్లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని నిలదీశారు. ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారని మహిళలు ప్రశ్నించగా ఇప్పిస్తామంటూ కొడాలి నాని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏమైనా సరే మీరు మాకు న్యాయం చేయాల్సిందేనంటూ మహిళలు కొడాలి నానిని డిమాండ్ చేశారు.
సొంత వారి నుంచే వ్యతిరేకత : తాడేపల్లిలోని అపర్ణ అపార్ట్‌మెంట్స్‌లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యను సొంత పార్టీ నేతలే నిలదీశారు. రాజధానిని విశాఖకు మార్చడం వల్ల తామెంత నష్టపోయమో చెబుతూ ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి లేదు, భూముల రేట్లు పడిపోయాయని ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో లావణ్య గెలుపుపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
ఎక్కడికెళ్లిన ఆ ఎమ్మెల్యేకు నిరసన సెగ : ఎన్నికల ప్రచారం కోసం ఏ ప్రాంతానికి వెళ్లినా ఎమ్మెల్యే విక్రం రెడ్డికి నిరసన సెగ తప్పడం లేదు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో సమస్యలపై విక్రంరెడ్డి మహిళలు అడుగడుగునా అడ్డగించారు. ఆత్మకూరు మండలం వాశిలిలో సంక్షేమ పథకాలకు మఖ్యమంత్రి బటన్ నొక్కినా డబ్బులు పడలేదంటూ మహిళలు నిలదీశారు. త్వరలోనే పడేటట్టు చేస్తామంటూ ఎమ్మెల్యే నిదానంగా అక్కడి నుంచి జారుకున్నారు.
మర్రిపాడు మండలం చిన మాచునూరులోనూ విక్రంరెడ్డి ముందు సమస్యల చిట్టా విప్పారు. సాగు, తాగు నీరు లేక అల్లాడుతుంటే పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారా అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలం కృష్ణాపురంలో విక్రంరెడ్డికి మద్దతుగా రచ్చబడం నిర్వహించిన మాజీ మంత్రి మేకపాటి రాజమోహన్‌కి నిరసన సెగ తప్పలేదు. సీఎం జగన్‌ని నమ్ముకుంటే తనపై అక్రమ కేసులు బనాయించారని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కేసులు వల్ల తన జీవితం నాశమైందంటూ వాపోయాడు.
మహిళలు నిలదీత : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి బుగ్గన తనయుడు అర్జున్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఎవరూ పట్టించుకోవట్లేదని మహిళలు నిలదీశారు. సమాధానం చెప్పకుండా మీకు అమ్మఒడి వచ్చిందా అని అర్జున్‌రెడ్డి ఎదురు అడగడంతో వచ్చింది. అయితే ఇప్పుడు తాగునీరు ఎవరిస్తారంటూ నిలదీశారు.
సామాన్యులకు అందుబాటులో ఉండారా? : విశాఖ దక్షిణ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్‌కి మత్స్యకారుల నుంచి నిరసన సెగ తగిలింది. విశాఖ మత్స్యకార బోటు గల్లంతుపై సకాలంలో స్పందించలేదంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు ఫిర్యాదు చేస్తే స్పందించరా అని ప్రశ్నించారు.
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు : విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పల నాయుడికి గిరిజనల నుంచి నిరసన సెగ తగిలింది. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న చిన అప్పల నాయుడిని రోడ్డు దుస్థితిపై ఓ మహిళ నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేపై మహిళల వాగ్వాదం : పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ పంచాయతీలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కళావతిని మహిళలు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదంటూ కొంతమంది మహిళలు కళావతిని చుట్టుముట్టి నిలదీశారు. ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మహిళలు వాగ్వాదానికి దిగారు.