Balineni Srinivasa Reddy to Resign YSRCP? : 'నిన్నామొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మరో బాంబు పేల్చారు. తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా ఆ పార్టీ అధినేత జగన్‌కే చెప్పేశారు. తన దారి తాను చూసుకుంటానని తేల్చేశారు. ఆయన జనసేన పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు' అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదంతా నిజమేనా, పార్టీలో తన ప్రాబల్యాన్ని తిరిగి పెంచుకునేందుకు సాగిస్తున్న వ్యూహమా అనేది ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
Balineni Srinivasa Reddy Join Janasena : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడారు. హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఓటమి బాధలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పార్టీ అధినేత జగన్‌ను కలవలేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒకసారి ఒంగోలు వచ్చి తన రాజకీయ ప్రత్యర్థి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత రోజే మళ్లీ ఒంగోలును వీడారు. వైఎస్సార్సీపీని వీడి వెళ్తున్న కార్పొరేటర్లనూ వారించే ప్రయత్నం చేయలేదు.
జిల్లా బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? : సుమారు 3 నెలలుగా ఒంగోలుకు, వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటున్న బాలినేని, ఎట్టకేలకు బుధవారం రాత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు ఇరవై నిమిషాల పాటు వారిద్దరి మధ్య వాడీవేడి చర్చ సాగినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని జగన్ చేసిన ప్రతిపాదనను బాలినేని తిరస్కరించినట్లు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి నుంచి తప్పించి అవమానించారని, ఆ తర్వాత తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రస్తుతం తనకు జిల్లా బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం.
పూర్వ వైభవం కోసం పాకులాట? : బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ ఛీప్ పవన్ కల్యాణ్‌తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో భిన్నమైన ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికీ ఆయన పవన్ కల్యాణ్‌తో సమావేశం కాలేదని, జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ రాలేదని కొందరు చెబుతున్నారు. వైఎస్సార్సీపీలో కీలక నాయకుడిగా వెలిగిన బాలినేని చేరికకు కూటమి అగ్రనేతల సమ్మతి కూడా అవసరమవుతుందని అంటున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ పూర్వ వైభవం కోసం బాలినేని ఆడుతున్న వ్యూహాత్మక నాటకం అనే ప్రచారం సైతం సాగుతోంది.
వైఎస్సార్సీపీలో ప్రకంపనలు : ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలోనూ తన మాట పట్టించుకోలేదనీ, పొరుగు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తెచ్చి ఎంపీ అభ్యర్థిగా తమపై రుద్దారని బాలినేని శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది. చెవిరెడ్డి కారణంగా జిల్లాలో పార్టీకి నష్టం వాటిల్లిందని చెప్పినట్లు సమాచారం.
ఎన్నికల్లో భారీగా వ్యయం చేస్తారనీ, అసెంబ్లీ అభ్యర్థులకు డబ్బు సర్దుబాటు చేస్తారని భావిస్తే, చెవిరెడ్డి చివరకు చేతులెత్తేశారనీ, ఫలితంగా జిల్లాలో నష్టం వాటిల్లిందని చెప్పినట్లు తెలిసింది. అధికారంలో ఉన్న సమయంలో పక్కనపెట్టి ఇప్పుడు బాధ్యతలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. తానిక వైఎస్సార్సీపీలో ఉండలేననీ, తన దారి తాను చూసుకుంటానని జగన్‌తో స్పష్టం చేసినట్లు సాగిన ప్రచారం, వైఎస్సార్సీపీలో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఆ నేతకు జిల్లా పార్టీ పగ్గాలు : బాలినేని పార్టీని వీడొచ్చనే ప్రచారంతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం కూడా అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన గురువారం మధ్యాహ్నం హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈయనకు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇదిలా ఉండగా బాలినేని వైఎస్సార్సీపీని వీడితే ఒంగోలులో ఆ పార్టీ బాధ్యతలను నెత్తికెత్తుకునేందుకు తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు సిద్ధంగా ఉన్నట్లు మరో ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. గతంలో ఒక దఫా ఒంగోలు నుంచే పోటీ చేసి ఓటమిపాలైన సదరు మాజీ ఎమ్మెల్యే తిరిగి ప్రాబల్యం కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఉంది.