Prime Minister Modi to Visit AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. మే 13వ తేదీన నాలుగో విడతలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుని మహాకూటమిగా బరిలోకి దిగుతున్న తరుణంలో మార్చి 17వ తేదీన చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద ప్రజాగళం బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు.
మోదీ పర్యటనపై వర్తమానం: వచ్చేనెల మూడు, నాలుగు తేదీల్లో రెండు రోజులపాటు పీఎం మోదీ ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ప్రధాని మోదీ పర్యటనపై వర్తమానం అందింది. ఈ రెండు రోజుల్లో రోడ్‌షోలు, బహిరంగ సభల నిర్వహణకు వేదికల ఖరారుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ఆరు లోక్‌సభ, పది శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
ప్రచార జోరు పెంచేందుకు: ఇక కేంద్ర మంత్రులను తమ పార్టీ ఎంపీ అభ్యర్ధుల నామినేషన్ల కార్యక్రమానికి పంపించిన బీజేపీ అగ్రనాయకత్వం - నామినేషన్ల ప్రక్రియ పూర్తి తర్వాత మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచార జోరు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే తేదీలను పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేసి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడంతో- ఆ రెండు రోజుల్లో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రధాని పర్యటనలు ఉండేలా రోడ్‌మ్యాప్ రూపొందించడంపై దృష్టి సారించారు.
రాష్ట్రానికి రానున్న స్టార్ క్యాంపెయినర్లు: బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన నాయకులతో చర్చించి ప్రధాన కార్యక్రమ వేదికలను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా అరుణ్‌సింగ్, సిద్ధార్ధ్‌నాధ్‌సింగ్ ఇప్పటికే నియోజకవర్గాల పర్యటనలతోపాటు మిత్రపక్షాలతో పార్టీ సమన్వయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రధాని పర్యటన తర్వాత మరికొందరు స్టార్ క్యాంపెయినర్లు కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
దూకుడు పెంచిన ఎన్డీఏ కూటమి- నేటి నుంచి చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం - CBN Pawan Joint Election Campaign
మరింత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు: ఇప్పటికే ప్రధాని మోదీ భహిరంగ సభలో సెక్యురిటీ సమస్యలు నెలకొన్న నేపథ్యలో ఈ సారి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రధాని పర్యటించే ప్రాతంతో సహా, ప్రధాని సభ ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ హాజరైన సభలోనే పోలీసులు విధి నిర్వహణలో విఫలమయ్యారు. ప్రధాని రావటానికి ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీజీ బృందాలు,సభ నిర్వహణలో బందోబస్తు పరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశారు. అప్పుడు పోలీసులు స్పందించలేదు. లైట్ల కోసం ఏర్పాటుచేసి టవర్ స్టాండ్ పైకి కొందరు కార్యకర్తలు ప్రమాదకరంగా ఎక్కారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టకపోవడం ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.