Positive Responce to TDP-Janasena-BJP Joint Manifesto: తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టో సూపర్‌హిట్ కొట్టేలా ఉందన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు మేనిఫెస్టోలో అక్షరరూపమిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్నీ సమతుల్యం చేస్తూ రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు రూపొందించిన దార్శనిక పత్రంగా ప్రజలు భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడుతున్నారు.
వైఎస్సార్సీపీ ఐదేళ్ల అరాచక పాలనలో విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు, దెబ్బతిన్న వర్గాలకు భరోసానిచ్చేలా ఉందని చర్చించుకుంటున్నారు. జగన్ విడుదల చేసిన వైఎస్సార్సీపీ మేనిఫెస్టో తుస్సుమనగా తెలుగుదేశం- జనసేన కూటమి మేనిఫెస్టోతో మూడు పార్టీల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుముకగా ఉన్న బీసీలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు విశేష ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ, భవిష్యత్తుకు భరోసానిస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేశారు. జనసేన 'షణ్ముఖ వ్యూహాన్ని' మేళవించి టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ఇప్పటికే విశేషంగా ప్రజల ఆదరణ చూరగొనగా, ఇప్పుడు విడుదల చేసిన పూర్తిస్థాయి మేనిఫెస్టో మరింత సమగ్రంగా, సంపూర్ణంగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కూటమి మేనిఫెస్టోకు - సైకో మేనిఫెస్టోకు పోలికే లేదు: చంద్రబాబు - Denduluru Prajagalam Sabha
బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్ల ఖర్చు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్లలో 10 వేల కోట్ల వ్యయం, 5 వేల కోట్లతో ఆదరణ పథకం, చేనేత కుటుంబానికి ఏడాదికి 24 వేల ఆర్థిక సాయం, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు 25 వేల వేతనం వంటి అనేక విశేష నిర్ణయాలను మేనిఫెస్టోలో ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ వంటి చరిత్రాత్మక నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళ్లనున్నాయి. అలాగే ఇప్పటికే అందుకుంటున్న పింఛన్‌ను ఏప్రిల్ నుంచే 4 వేల రూపాయలకు పెంచడం ప్రజలకు మరింత దగ్గర చేయనుంది. ఇప్పటికే 66 లక్షల మంది పింఛన్‌దారులు ఉండగా 50 ఏళ్లకే పింఛన్ వర్తింపు ద్వారా మరి కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ అమలు చేయని సంచలనాత్మక నిర్ణయం కూటమి తీసుకుంది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. ఇది ప్రజారోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. కుటుంబంలో ఏ ఒక్కరికైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఎంతో కుంగిపోతోంది.
ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందడం లేదు. కానీ ఇప్పుడు ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన ఆసుపత్రుల్లో వైద్యం పొందే అవకాశం దక్కనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే ఇక ప్రతి కుటుంబం ఆస్పత్రుల భయం లేకుండా హాయిగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవచ్చు.
తెలుగుదేశం పార్టీకి మహిళలే మహాశక్తి. మహిళా సాధికారత, స్వావలంబన కోసం అన్న ఎన్టీఆర్, చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడ్డారు. మళ్లీ ఇప్పుడు వారికోసం మేనిఫెస్టోలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయడంతోపాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం సూపర్ హిట్టయ్యింది. గతంలో డ్వాక్రా సంఘాలకు ఐదు లక్షల వరకు వడ్డీలేని రుణం ఉండగా జగన్ 3 లక్షలకు కుదించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి 10 లక్షల వరకు వడ్డీలేని రుణం అందిస్తామని హామీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ పాలనలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరిపి ఇతర రాష్టాలకు తరలించడంతో రాష్ట్రంలో భవననిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానం మళ్లీ పునురుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో నిర్మాణరంగం ఊపిరి పీల్చుకుంది.
పేరుకు అగ్రవర్ణాలే అయినా చాలామంది బ్రాహ్మణులు పూటగడవని పరిస్థితుల్లో ఉన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న బ్రాహ్మణులకు టీడీపీ-జనసేన మేనిఫెస్టోలో విస్తృత ప్రాధాన్యమిచ్చారు. వార్షిక ఆదాయం 50 వేలకు పైన ఉన్న ఆలయాల్లోని అర్చకులకు కనీస వేతనం 15 వేలు, 50 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని 10 వేలకు పెంచడం వారికి ఎంతో ఊరటనిస్తుంది.
టీటీడీ సహా అన్ని దేవాలాయాల ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడం, వేద విద్య చదువుకున్న నిరుద్యోగులకు 3 వేల భృతి వంటి నిర్ణయాలు వారికెంతో మేలు చేయనున్నాయి. జగన్ పాలనతో అత్యంత ఎక్కువ మోసానికి గురైంది యువతే. ప్రతిపక్ష నేతగా వారి భ్రమలు కల్పించి వారి ఆవేశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న జగన్ గద్దెనెక్కిన తర్వాత వారి ఊసే మర్చిపోయారు.
మెగా డీఎస్సీ, జాబ్‌క్యాలెండర్‌పై చేతులెత్తేశారు. పరిశ్రమలను తరిమికొట్టడంతో ఉపాధి కోల్పోయి యువత రోడ్డునపడ్డారు. చదువుకున్న యువత ఉద్యోగాలు లేక తీవ్ర నిరాశలో ఉన్నారు. వీరందరికీ టీడీపీ-జనసేన మేనిఫెస్టోలో అనేక వరాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడంతోపాటు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వంటి హామీలతో యువతలో జోష్ నింపారు.
టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాలంటీర్లకు ఇప్పుడిస్తున్న 5 వేల వేతనాన్ని 10 వేలకు పెంచుతామని టీడీపీ జనసేన ప్రకటించాయి.