YSRCP Attacks in Palnadu district : పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించారు. దాడుల నేపథ్యంలో నరసరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. దాచేపల్లి మండలం తంగెడలో ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పర దాడులు చేశారు. ఈ ఘటనలో రెవెన్యూ సిబ్బంది బైకు దగ్ధమైంది.
నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. మున్సిపల్ హైస్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేశారు. వైసీపీ శ్రేణుల అలజడితో ఓటర్లు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జీ చేయడంతో వైఎస్సార్సీపీ మూకలు పలువురు ఓటర్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు ఓటర్లకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. ఈ దాడిని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. ఎమ్మెల్యే ఇంటివద్ద వాతావరణం రణరంగంలా మారింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపి పరిస్థితి ని అదుపులోకి తెచ్చారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో రెండు గంటలుగా పోలింగ్ నిలిచిపోయింది. వంద మందికి పైగా వైఎస్సార్సీపీ మూకలు ఒక్కసారిగా దాడి చేసి పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు పోలింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లిపోగా సాయం కోసం పోలింగ్ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని దొడ్లేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రోడ్లపైకి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - 'ఆ ఎమ్మెల్యే'ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశం - MLA house arrest
పల్నాడు జిల్లా మాచర్ల PWD కాలనీలో వైఎస్సార్సీపీ నేతల అరాచకానికి అడ్డే లేకుండా పోయింది. తెలుగుదేశం నేత కేశవరెడ్డితోపాటు ఆయన అనుచరులపై వందమంది వైకాపా మూకలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకుని పారిపోతున్న తెలుగుదేశం నాయకులను వాహనాలతో తొక్కించేందుకు యత్నించారు. వైకాపా అరాచక దాడిలో 10 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం వల్ల కొద్దిసేపు ఇబ్బంది ఎదురైంది. ఆ తర్వాత ఇతర వాహనాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత కూడా వైకాపా మూకలు వాహనాలపై తిరుగుతూ ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేశారు.
రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మూకల దాడిలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెంటాలలో వైఎస్సార్సీపీ మూకలు విధ్వంసం సృష్టించాయి. తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనానికి నిప్పుపెట్టాయి. రెంటాల పోలింగ్ సరళిని చూసేందుకు బ్రహ్మానందరెడ్డి వెళ్లగా అక్కడ వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య నెలకొన్న ఘర్షణలో ఆయన కారుపై రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశాయి. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బంది కళ్లలో వైసీపీ మూకలు కారం కొట్టాయి.
రెంటచింతల మండలం తుమృకోటలో పలు పోలింగ్ కేంద్రాల్లో EVMలు, సీసీ కెమెరాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ శ్రీకాంత్, SP బిందు మాధవ్ , మాచర్ల ఆర్వో శ్యాంప్ ప్రసాద్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కంభంపాడులో పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో వైఎస్సార్సీపీ నేతలు రహదారి పైకి వచ్చి గందరగోళం సృష్టించారు. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు.
వెల్దుర్తి మండలం లోయపల్లిలో తెలుగుదేశం వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి వైఎస్సార్సీపీ నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి.
'ఈ ఎన్నికలు భవిష్యత్‌కు బాటలు' - వైఎస్సార్సీపీ నేతల దాడులపై చంద్రబాబు ఫైర్ - AP ELECTIONS 2024