Polling Begins in Yanam Puducherry : కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 30వ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంటూ కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో రెండు బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాడ్, ట్రోల్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేశారు.
యానాంలో 33 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. వీటిలో పది పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా మరో పది కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. యానాం నియోజకవర్గంలో మొత్తం 39 వేల 408 మందికి ఓటు హక్కు ఉన్నట్లు తెలిపారు. వీరిలో పురుషులు 19037, స్త్రీలు 20371 మంది ఉన్నారని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పార్టీల ఏజెంట్లతో కలిసి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి మాక్ పోలింగ్ నిర్వహించారు.
మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న యవత : పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు స్థానానికి యానాంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొదటిసారి యువత తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తల్లి భారతితో కలిసి 12వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ పుదుచ్చేరికి చెందిన వారు కావడంతో ఇక్కడ వారి తరఫున ప్రతినిధులు ఎన్నికలలో పర్యవేక్షిస్తున్నారు.
యానాంలో ఓటు వేసిన మాజీ మంత్రి : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రంకు ఉన్న ఒకే ఒక్క పార్లమెంటు స్థానానికి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పుదుచ్చేరికి చెందిన కేంద్రపాలిత ప్రాంతం యానాం వెటర్నరీ డిస్పెన్సరీ 12వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ఆయన సతీమణి ఉదయలక్ష్మి, కుమారులు, కోడలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 33 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.