Lok Sabha Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండటంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. గద్వాల జిల్లాలో నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలంలో హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ప్రచారం చేశారు.
నల్గొండ జిల్లా చండూర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డికి మద్దతుగా భువనగిరి లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లో హస్తం పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ముల్కనూరులో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచార ర్యాలీ తీశారు.
BJP Election Campaign for Parliament Election : సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ, అడ్డగుట్ట డివిజన్లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నాచారంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
సికింద్రాబాద్‌లోని పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశా తిలక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు గులాబీ పార్టీ అభ్యర్థి నివేదిత ఇంటింటా ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. మెదక్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, వెంకట్రామిరెడ్డిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'నా తర్వాత ఎంపీగా వినోద్ కుమార్, బండి సంజయ్ వచ్చారు. మీరు ఈ నియోజకవర్గానికి, ఈ మండలానికి ఏం చేశారో చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధికి సంబంధించిందైనా, ఏ అంశమైనా చర్చ చేయడానికి సిద్ధమా అని అడుగుతున్నా.' - పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి