Lok Sabha Election Campaign in Telangana : ఊరూరా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మంలో సీపీఎం నాయకులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి ప్రచార ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓసీపీ-ఫైవ్ ఉపరితల బొగ్గు గనిపై అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్‌లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
మల్కాజిగిరిలోని లోక్‌సభ సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఖమ్మం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిజామాబాద్‌లోని చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే రెండవ బొగ్గుగనిపై టీబీజీకేఎస్ కార్మిక నాయకులతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మార్నింగ్ వాక్‌లో భాగంగా నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్‌లో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, స్థానికుడైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
BRS Election Campaign : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తమను అత్యధిక మెజర్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో భారీ మెజారిటే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న అభ్యర్థులు, మేనిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరిస్తూ ఓట్ల వేట కొనసాగిస్తున్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా పార్టీ శ్రేణులు కరీంనగర్ జిల్లా రేకొండ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్, తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ జిల్లాకు వన్నె తెస్తానని హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్‌పై విమర్శల వర్షం గుప్పించారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇంటింటా తిరుగుతూ భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.