PM Modi At BJP Vijaya Sankalp Sabha Sangareddy : తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు వృథా కానివ్వనని, ఇది మోదీ గ్యారంటీ అంటూ హామీ ఇచ్చారు. తాను చెప్పింది చేసి చూపించే వ్యక్తినని, భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలనేదే తన ధ్యేయమని తెలిపారు. భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందన్న మోదీ (PM Modi Sangareddy Tour), ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ప్రధాని బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు.
BJP Vijaya Sankalp Sabha Sangareddy : "ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 రద్దు హామీ అమలు చేశాం. అయోధ్య రామ మందిరం నిర్మించి తీరుతామని చెప్పాం. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించాయి. కుటుంబ పార్టీలు ఉన్నచోట కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబ పార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా? వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నా. కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. యువతకు అవకాశాలు దొరకట్లేదు." అని ప్రధాని మోదీ అన్నారు.
అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ విమర్శిస్తోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వారసత్వ నేతలకు భయం పట్టుకుందన్న ప్రధాని, కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. ఆ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నానని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని తానెప్పుడూ వమ్ము కానివ్వనని స్పష్టం చేశారు.
దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. తెలంగాణ యువత స్వప్నాలను సాకారం చేస్తాను. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపాం. కోట్లాది ఎస్సీ యువత స్వప్నాలను సాకారం చేశాం. తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే. నాణేనికి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్. కాళేశ్వరం పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
Kishan Reddy At BJP Meeting in Sangareddy : అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. మార్పు వస్తుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని, కానీ తెలంగాణలో ఏరకమైన మార్పు కనిపించట్లేదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందన్న కిషన్‌రెడ్డి కాంగ్రెస్ నేతలు రాహుల్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేపట్టారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల కోసం బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే. రెండు పార్టీలకు ఎంఐఎం జత కలిసింది. మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను దోచుకున్నాయి. నిజమైన మార్పు కోసం కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి. బీఆర్ఎస్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని చూసింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్‌ను ప్రధాని చేయాలని చూస్తోంది. బీజేపీ ఒక్కటే ప్రజల కోసం పనిచేసే పార్టీ. మరోసారి మోదీ హ్యాట్రిక్ ప్రధాని కాబోతున్నారు. - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు