Pawan Kalyan Varahi Yatra in Rajanagaram Constituency: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. గంజాయి, ఇసుక దోపిడీకి రాజానగరం కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌తో సావాసం చేసి జక్కంపూడి పిల్లలు అలాగే మారారని విమర్శిచారు. లే అవుట్‌లో వాటాలు తీసుకున్న వ్యక్తి జక్కంపూడి రాజా అని ఇళ్ల పట్టాలపై రూ.300 కోట్లు సంపాదించారని పవన్ అన్నారు ఆరోపించారు.
కాపులకు రిజర్వేషన్ ఇవ్వని వ్యక్తి జగన్ అని పవన్ అన్నారు. కాపు కార్పొరేషన్‌లో టైపిస్టులకు కూడా జీతం ఇవ్వలేని దుస్థితి నెలకొందని అన్నారు. కాపులు జగన్‌కు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని అన్నారు. కాపులకు ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేశారో వైసీపీ కాపు ఎమ్మెల్యేలు చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ కాపు ఎమ్మెల్యేలు నన్ను తిట్టడం తప్ప వారు చేసిందేంటని అన్నారు. గంగా నది తరహాలో గోదావరి ప్రక్షాళన చేపడతామని అధికారంలోకి వచ్చాక జగన్ కోరుకున్న జైలుకే పంపిస్తామని అన్నారు. సినీనటులను పిలిచి అవమానించిన వ్యక్తి జగన్ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగనన్నపై బెట్టింగ్‌కు జంకుతున్న పందెంరాయుళ్లు - Bookies bet big on TDP win in AP
జనసేన కార్యకర్తలను లక్ష్యంగా చేసి దాడులు, అక్రమ కేసులు పెట్టిన పోలీసులను వదలమంటూ పవన్ హెచ్చరించారు. యువత పాతికేళ్ల భవిష్యత్ కోసం ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ కోటలు బద్దలుకొట్టి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తమని పవన్ ధీమా వ్యాక్తం చేశారు. ఈ సారి జగన్ తన పర్యటనలో పరదాలూ కట్టలేదు, చెట్లూ కొట్టలేదని అన్నారు. రాయి దాడి విషయంలో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏపీలో ప్రధాని పర్యటనలోనూ సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేశారు.
వైఎస్ జగన్‌ను భయపెట్టే భారీ మెజారిటీ ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని ఉద్ఘాటించారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం లో 40 వేల కోట్లు దోచుకున్నాడని పవన్ ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేయకపోగా కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరిస్తున్న వైసీపీని తన్ని తరిమేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అరాచకం చేసిన వైసీపీ రౌడీలను మాత్రం వదలదని పవన్ హెచ్చరించారు.