Pawan Kalyan Respond on Pension Distribution Issue : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు కంటే, పింఛన్ డబ్బుల పంపిణీ విషయంలో జరిగే ప్రచార హోరు ఎక్కువైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పింఛన్ అంశంపై ఒక్కరిపై ఒక్కరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ డబ్బులు చెల్లించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రతిపక్షాలు అడ్డుకోవడం ద్వారానే పింఛన్ చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. తాజాగా ఇదే అశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
పింఛన్ల పంపిణీపై అధికార పార్టీ అసత్య ప్రచారాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛను పంపిణీకి ఇబ్బంది ఏమిటి ? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నా సినిమాకు థియేటర్ల వద్ద రెవెన్యూ సిబ్బందికి డ్యూటీలు వేస్తారు, కానీ, పింఛన్లు ఇవ్వడానికి మాత్రం ఉద్యోగులు లేరా? అంటూ ప్రశ్నించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు ఇళ్ల వద్ద ఇవ్వొచ్చు అంటూ పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ కుట్ర - వృద్దులను మంచాలపై తీసుకువస్తూ టీడీపీపై విషప్రచారం - YCP Conspiracy on Pensions
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి ? పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు. తహసీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా ? కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకు డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ల దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి.'- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
పవన్ పర్యటన రద్దు: గురువారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరగబోయే సభ వాయిదా పడింది. పవన్ కల్యాణ్ అనారోగ్యం కారణంగానే సభ వాయిదా వేసినట్లు, ఆ నియోజకవర్గ కూటమి అభ్యర్ధి లోకం మాధవి ప్రకటించారు. పవన్ మంగళవారం ఇరవై కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు. దీంతో ఎండ వేడిమికి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జ్వరం బారిన పడ్డారు, జ్వరం పూర్తిగా తగ్గలేదు. దీంతో ఈరోజు జరగాల్సిన తెనాలి పర్యటనతో పాటుగా, రేపు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరగాల్సిన సభ రద్దైంది.