PAWAN KALYAN GRAMA SABHA: గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో 'గ్రామసభ' చాలా ముఖ్యమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
కాగా 'స్వర్ణ గ్రామపంచాయతీ' పేరుతో నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో 'గ్రామసభలు' నిర్వహించున్నారు. మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంపై రాష్ట్రస్థాయి గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు పవన్‌తో పాటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
గ్రామాలు పచ్చగా ఉంటేనే: అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని తాను వదలుకోనని, మనుషులను కలుపుకొనే వ్యక్తినని, విడగొట్టేవాణ్ని కాదని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్న పవన్, 13 వేల 326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు.
ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్: గత ప్రభుత్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని, అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని పవన్ మండిపడ్డారు. భర్త ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మైసూరువారిపల్లె సర్పంచ్‌గా సంయుక్త నిలబడి గెలిచారని ప్రశంసించారు. కారుమంచి సంయుక్త పట్టుదల చూసి నాకు చాలా ఆనందం కలిగిందన్న పవన్, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామన్నారు. ఉన్న నిధులను కూడా దారిమళ్లించిన పరిస్థితి గతంలో చూశామని, గ్రామాలకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే తమ లక్ష్యమన్న పవన్, ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ బంగారు సంకల్పం - నేడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు - Grama Sabhalu in AP
చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన: బాధ్యతల నుంచి తాము పారిపోమని, నిరంతరం పనిచేస్తామని తెలిపారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని, గుండెల నిండా నిబద్ధత ఉందన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని తాను చాలా సభల్లో చెప్పానని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే అని కొనియాడారు. లక్షలమందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వగలిగారన్న పవన్, నాకంటే బాగా ఆలోచించగలిగేవాళ్ల వెంట నడిచేందుకు తానేమీ సంకోచించనని తెలిపారు. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందన్నారు.
కూలీ మాదిరిగా పనిచేసేందుకు సిద్ధం: ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న పవన్, ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటానని, అండగా ఉంటానని తెలిపారు. పదవి తనకు అలంకారం కాదని, బాధ్యతగా ఉంటానన్నారు. తానెప్పుడు పనిచేసేందుకే సిద్ధంగా ఉంటానని, ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తామన్నారు.
గ్రామాల్లో కళాశాలలు, క్రీడా మైదానాలు కూడా లేని పరిస్థితి ఉందని, ప్రభుత్వ భూములుంటే నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వపరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే అవుతుందని, దాతలు ముందుకొస్తే తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి వలసలు నివారించి, ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు.
వలసలు ఆగడానికి స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ తీసుకొస్తామన్న పవన్, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. భవిష్యత్ తరం నాయకులు తయారుకావడానికి పంచాయతీలే పట్టుగొమ్మలని, పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు కల్పించుకుంటే తప్ప గ్రామపంచాయతీలు మారవన్నారు.