Pawan Kalyan Allegations on Jagan in Varahi Vijayabheri Meeting: ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుందని ప్రజలు భారీ మోజార్టీ ఇవ్వాలని కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. సముద్ర తీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని మత్స్య కారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని తెలిపారు.
జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేసిన చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని పవన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అని జగన్ జనాలను నిలువునా ముంచాడని విమర్శించారు. అప్పట్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు నిలిచారని ఇప్పుడు నిరంకుశ వైసీపీని ఓడించడానికి అన్ని పక్షాలు ఒక్కటయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడిందని తెలిపారు. ఈ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించండని ప్రజలను పవన్ కోరారు.
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయానికి కూటమి ప్రభుత్వంలో పెద్దపీఠ వేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. సముద్రతీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సీఎం జగన్ దోచుకున్నారని మండిపడ్డారు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత ఆ ఊసే లేదని అన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోందని మద్యం వ్యాపారులు జీఎస్టీ కట్టడం లేదని ఆరోపిచారు. ఇసుకలో రూ.కోట్ల అవినీతి జరిగిందని మనకు తెగింపు రానంత వరకు మార్పు కనిపించదని పవన్ కల్యాణ్ అన్నారు.
కూటమి ప్రభుత్వంలో యువత కోసం రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అలానే రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాని తెలిపారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ అందిస్తామని ఆరోగ్యశ్రీకి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి పోలవరానికి నా తరఫున రూ.కోటి విరాళం ఇస్తానని పవన్ అన్నారు. రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు. పాఠశాలల్లో తెలుగు మీడియం ఉండాలని నీతి కథలు విద్యార్థులకు అవసరం మాతృ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ అన్నారు.