Pavan Kalyan Varahi Vijaya Bheri Sabha in Malikipuram: పచ్చని కోనసీమలో కులాల మధ్య వైసీపీ ప్రభుత్వం చిచ్చు రాజేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. కోనసీమ జిల్లా మలికిపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసు పెట్టారని అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కోనసీమకు రైలును తీసుకొచ్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అవినీతికి పాల్పడ్డారని పవన్ కల్యాణ్ విమర్శించారు. రాపాక 5 ఎకరాల్లో ఇళ్లు కట్టుకుంటున్నారంటే ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ కనిపిస్తుందని అన్నారు. ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ నిధులతో రాపాక ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అవినీతి చేసిన వారిని రోడ్డుపైకి లాక్కొస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపాక వరప్రసాద్ సఖినేటిపల్లిలో ఫైర్‌స్టేషన్‌ను తీసుకురాలేదని అన్నారు. ఈ ప్రభుత్వ రోడ్లేస్తే 2 రోజులు కూడా ఉండట్లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వ్యక్తులపైనే ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని కావాలని ఎవరైనా అడిగితే వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టి వేధిస్తున్నారని పవన్ ఆగ్రహించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ రోజు ప్రతి అడ్డమైన వ్యక్తుల చేత నేను మాటలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయ్‌ను గొడ్డలితో నరికించిన జగన్‌ని మాత్రం భుజాలపై వేసుకుంటారని అన్నారు. జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై అన్యాయంగా కేసు పెట్టారని అన్నారు. అంతమంది సమూహంలో గులకరాయి వేసిన నిందితుడిని పట్టుకున్నారు. కాని అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదని అన్నారు. జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి వంటి దోపిడీదారులకు భయపడనని పవన్ కల్యాణ్ అన్నారు.
సంపద సృష్టించి ప్రజలకు డబ్బులు పంచాలి కాని జగన్ అవేమీ చేయకుండా బటన్లు నొక్కుకుంటూ ఉన్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం సంపద సృష్టించాలి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి కాని జగన్ సంక్షేమం పేరు చెప్పి లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గోదావరి జిల్లాలను పర్యాటక హబ్‌గా మారుస్తామని పవన్ హామీ ఇచ్చారు. అవినీతిరహిత పాలనను ఎన్డీఏ కూటమి అందిస్తుందని తెలిపారు. రాజోలును స్మార్ట్‌సిటీగా మారుస్తామని రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని భరోసా ఇచ్చారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని అన్నారు.